మనందరి ఇళ్లలోనూ మందుల బాక్స్ ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం తలనొప్పి వస్తే సారిడాన్, ఒళ్లు నొప్పులు ఉంటే కాంబిఫ్లామ్, లేదా జ్వరం వస్తే క్రోసిన్ వేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. అయితే, ఇలా సొంతంగా చేసుకునే వైద్యం మీ శరీరానికి ‘స్లో పాయిజన్’ (నెమ్మదిగా చంపే విషం) లాంటిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గతంలో డాక్టర్ ఇచ్చిన మందుల కోర్సును పూర్తి చేయకుండా, వాటిని భద్రపరిచి.. మళ్ళీ ఎప్పుడైనా అదే లక్షణాలు కనిపిస్తే పాత ప్రిస్క్రిప్షన్ ఆధారంగా సొంతంగా మందులు వేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతిసారీ కనిపించే లక్షణాలు ఒకేలా ఉన్నప్పటికీ, వ్యాధికి గల అసలు కారణం వేరుగా ఉండవచ్చు. డాక్టర్ సలహా లేకుండా తీసుకునే ఈ మందులు తాత్కాలిక ఉపశమనం కలిగించినా, లోపల శరీరాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తాయి.
శరీరంపై చూపే దుష్ప్రభావాలు:
- కిడ్నీ వైఫల్యం: తరచుగా పెయిన్ కిల్లర్స్ (నొప్పి నివారణ మందులు) వాడటం వల్ల యువతలో కిడ్నీలు పాడయ్యే ప్రమాదం పెరుగుతోంది.
- లివర్ సమస్యలు: అనేక మందులు కాలేయంలో మెటబాలైజ్ అవుతాయి. వీటిని అతిగా వాడటం వల్ల కాలేయానికి వాపు రావచ్చు.
- యాంటీబయాటిక్ రెసిస్టెన్స్: సాధారణ జలుబు, దగ్గుకు కూడా యాంటీబయాటిక్స్ వాడే అలవాటు వల్ల, భవిష్యత్తులో తీవ్రమైన అనారోగ్యం వచ్చినప్పుడు ఆ మందులు శరీరంపై ఏమాత్రం పనిచేయవు.
- తీవ్రమైన రియాక్షన్స్: కొన్ని మందుల వల్ల శ్వాస ఆడకపోవడం లేదా రక్తపోటు అకస్మాత్తుగా పడిపోయి మరణం సంభవించే అవకాశం ఉంది.
- వ్యాధి నిర్ధారణలో జాప్యం: మందుల వల్ల వ్యాధి లక్షణాలు తాత్కాలికంగా అణచివేయబడతాయి. దీనివల్ల క్యాన్సర్ లేదా గుండెపోటు వంటి పెద్ద వ్యాధులను సకాలంలో గుర్తించలేము.
ముఖ్యమైన సూచనలు: మందులు వాడే ముందు వాటి గడువు (Expiry Date) తనిఖీ చేయండి. తేమ ఉన్న చోట లేదా నేరుగా సూర్యరశ్మి తగిలే చోట మందులను ఉంచితే వాటి గుణాలు మారిపోతాయి. ఏదైనా మందు వేసుకునే ముందు కనీసం మీ ఫ్యామిలీ డాక్టర్తో ఫోన్లోనైనా చర్చించండి.
