‘సొంత సోదరుడినే పెళ్లి చేసుకుంది..! అసహ్యకరమైన విషయం’.. వేదికపైనే మహిళా ఎంపీని అవమానించిన ట్రంప్; వైరల్ అవుతున్న వీడియో!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ పార్లమెంట్ సభ్యురాలు ఇలాన్ ఉమర్‌పై మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ట్రంప్, ఆమె మాట్లాడే తీరును ఎగతాళి చేయడమే కాకుండా, ఆమె తన సొంత సోదరుడినే వివాహం చేసుకుందంటూ బహిరంగంగా ఆరోపించారు.

వేదికపై ట్రంప్ మాట్లాడుతూ.. “ఇలాన్ ఉమర్ తన సొంత సోదరుడినే పెళ్లి చేసుకుందని నేను భావిస్తున్నాను. ఇది చట్టరిత్యా పూర్తిగా తప్పు. నిజం చెప్పాలంటే, వారిద్దరూ చూడటానికి మంచి జంటగానే ఉండవచ్చు కానీ అది చట్టవిరుద్ధం” అంటూ వెటకారంగా వ్యాఖ్యానించారు.

అవమానకరమైన రీతిలో మిమిక్రీ:
అంతటితో ఆగకుండా, ఇలాన్ ఉమర్ మాట్లాడే శైలిని ట్రంప్ మిమిక్రీ చేస్తూ ఒక ఊహాజనిత సంభాషణను నటించి చూపారు. “ప్రియతమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. గుడ్ నైట్ సోదరా, పదా నిద్రపోదాం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడ ఉన్న మద్దతుదారుల మధ్య సంచలనం కలిగించాయి. “ఆమె (ఇలాన్) అసహ్యకరమైన వ్యక్తి కాదా? ఆమెను చూడటం కూడా నేను సహించలేకపోతున్నాను” అంటూ తన విద్వేషాన్ని వెల్లడించారు.

సోమాలియాపై విమర్శలు:
ఇలాన్ ఉమర్ సోమాలియా నుండి వలస వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ దేశంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. “సోమాలియా ఒక అందమైన ప్రదేశం అని అంటారు. కానీ అక్కడ ప్రభుత్వం లేదు, సైన్యం లేదు. కేవలం పేదరికం, కాలుష్యం, నేరాలు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన దేశం నుండి వచ్చి, అమెరికాను ఎలా పాలించాలో ఆమె మనకు పాఠాలు చెబుతోంది” అని మండిపడ్డారు.

ఆర్థిక మోసాల ఆరోపణలు:
ఇలాన్ ఉమర్ ఆర్థిక మోసాలకు పాల్పడిందని కూడా ట్రంప్ ఆరోపించారు. “గత నెలలో ఆమె తన ఆస్తి విలువ 38 మిలియన్ డాలర్లుగా ప్రకటించింది. కానీ దర్యాప్తు సంస్థల విచారణ ప్రారంభం కాగానే, అకస్మాత్తుగా అది 80,000 డాలర్లకు పడిపోయింది. ఇది అకౌంటింగ్ పొరపాటు అని ఆమె సాకులు చెబుతోంది. ఇలాంటి వ్యక్తుల జీవితమే మోసాల పునాదిపై ఉంటుంది. వీరిని దేశం నుండి వెళ్లగొట్టాలి” అని ఆవేశంగా మాట్లాడారు.

నేపథ్యం: ఇలాన్ ఉమర్ తన ఇమ్మిగ్రేషన్ వీసా కోసం సొంత సోదరుడిని వివాహం చేసుకుందంటూ కన్జర్వేటివ్ సంస్థలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్ మళ్ళీ ఈ పాత విషయాన్ని తెరపైకి తేవడం అమెరికా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.


Posted

in

by

Tags: