కొచ్చి: వయనాడ్ టౌన్షిప్ సందర్శన సమయంలో సీపీఎం జిల్లా కార్యదర్శిని పక్కకు తప్పుకోమని చెప్పిన నటుడు మమ్ముట్టిపై రచయిత్రి శారదకుట్టి విమర్శనాస్త్రాలు సంధించారు.
జిల్లా కార్యదర్శి కె. రఫీక్ ఫోటోను షేర్ చేస్తూ ఆమె ఒక పోస్ట్ పెట్టారు. “భాస్కర పటేలర్ (మమ్ముట్టి పోషించిన ఒక పాత్ర), వారియంకున్నత్ అహమ్మద్ హాజీలకు కూడా అభద్రతాభావం, భయం కలిగించే ఏదో ఒక శక్తి ఈ యువ నాయకుడి ఆహార్యంలో, నడకలో, గాంభీర్యంలో ఉంది. ఈ ప్రపంచంలో నేనే అందగాడిని, నాయకుడిని అనుకునే వ్యక్తికి (మమ్ముట్టికి) ఒక్క క్షణం భయం వేసింది. అది ఆయన దాచలేకపోయిన వణుకు. అంతే తప్ప ఇంకేం లేదు” అంటూ ఆమె వ్యంగ్యంగా రాసుకొచ్చారు.
అసలేం జరిగింది? వయనాడ్ టౌన్షిప్ సందర్శనలో తన వెంటే వస్తూ, జనాలను నియంత్రిస్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శి కె. రఫీక్ పట్ల మమ్ముట్టి అసహనం వ్యక్తం చేశారు. ఆయనను పక్కకు తప్పుకోమని కోరారు. దీనిపై లెఫ్ట్ సైబర్ హ్యాండిల్స్ మమ్ముట్టిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే, యూడీఎఫ్ (UDF) మాత్రం మమ్ముట్టి వ్యాఖ్యలను సమర్థిస్తూ, ఇది ప్రజల టౌన్షిప్ అని ఆయన అన్న మాటలను గుర్తు చేస్తోంది.
మమ్ముట్టి సన్నిహితుల వివరణ: మమ్ముట్టి ఈ పర్యటనను పూర్తిగా వ్యక్తిగత పర్యటనగా ఉంచాలని భావించారు. చైన్నై నుంచి ఆయన కేవలం టౌన్షిప్ను చూడటానికి మాత్రమే వచ్చారని, కనీసం మీడియాకు కూడా ఈ సమాచారం ఇవ్వలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అక్కడకు రావాలని ఆయన ఎవరినీ కోరలేదని, నాయకులు వరుసగా ఆయనను అనుసరిస్తూ హడావుడి చేయడంతోనే ఆయన అసహనానికి గురై పక్కకు తప్పుకోమని అన్నారని వారు స్పష్టం చేస్తున్నారు.
