దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నగరంలో దాదాపు 56,000 మంది అభిమానులు కిక్కిరిసిన స్టేడియం పైనుంచి రెండు ప్యాసింజర్ విమానాలు అత్యంత తక్కువ ఎత్తులో దూసుకెళ్లిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
దక్షిణాఫ్రికా – న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రగ్బీ మ్యాచ్కు ముందుగా ఈ విమాన విన్యాసాలు (ఎయిర్ షో) నిర్వహించారు. స్టేడియం పైకప్పుకు అతి సమీపంలో విమానాలు రయ్యింటూ దూసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో క్షణాల్లో వైరల్గా మారాయి.
స్థానిక విమానయాన సంస్థ ‘ఎయిర్లింక్’కు చెందిన రెండు ఎంబ్రేయర్ రకం విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. విమాన రాకపోకలను పర్యవేక్షించే వ్యవస్థల అంచనాల ప్రకారం.. ముందు వెళ్లిన విమానం స్టేడియం పైకప్పుకు కేవలం 41 నుంచి 46 అడుగుల ఎత్తులో మాత్రమే ప్రయాణించినట్లు వెల్లడైంది. రెండో విమానం దాని వెనుకే వెళ్తూ, స్టేడియం పైకప్పు నుంచి వెలువడుతున్న గులాబీ రంగు పొగ మీదుగా దూసుకెళ్లింది.
ఈ విన్యాసాలను స్టేడియంలోని ప్రేక్షకులు ఈలలు, కేరింతలతో ఉత్సాహంగా స్వాగతించినప్పటికీ.. విమానాలు ఇంత తక్కువ ఎత్తులో ప్రయాణించడంపై విమానయాన భద్రతా నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ఇంత తక్కువ ఎత్తులో వెళ్తున్నప్పుడు ఆకస్మికంగా పక్షులు ఢీకొన్నా లేదా గాలి వేగంలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నా విమానాలను సురక్షితంగా అదుపు చేయడానికి తగినంత సమయం, స్థలం ఉండవని వారు హెచ్చరించారు. దీంతో ఈ విన్యాసం చుట్టూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
మరోవైపు విమానయాన సంస్థ స్పందిస్తూ.. ఈ విమాన విన్యాసాన్ని ముందస్తు ప్రణాళికతో, పలుమార్లు రిహార్సల్స్ నిర్వహించిన అనంతరమే ప్రదర్శించినట్లు స్పష్టం చేసింది. ఈ రెండు విమానాల్లో ప్రయాణికులెవరూ లేరని, కేవలం అనుభవజ్ఞులైన సీనియర్ పైలట్లు, సేఫ్టీ ఆఫీసర్లు మాత్రమే ఉన్నారని పేర్కొంది. ఏవియేషన్ సేఫ్టీ అధికారులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) మార్గదర్శకాలు, అనుమతులకు లోబడి వేగం, ఎత్తు వంటి భద్రతా ప్రమాణాల పరిధిలోనే ఈ విన్యాసాన్ని చేపట్టినట్లు ‘ఎయిర్లింక్’ వివరణ ఇచ్చింది.

Leave a Reply