చండీగఢ్ నుంచి ముంబై వెళ్లే విమాన ప్రయాణం కోసం వినీత్ ఖురానా అనే వ్యక్తి తనతో పాటు తన భార్య, నలుగురు స్నేహితుల కోసం కాళ్లు పెట్టుకోవడానికి అదనపు స్థలం (ఎక్స్ట్రా లెగ్రూమ్) ఉన్న ఆరు సీట్లను రూ.4,620 అదనపు రుసుము చెల్లించి ముందస్తుగా బుక్ చేసుకున్నారు.
అయితే, 2023 జనవరి 16న విమానాశ్రయానికి వెళ్లినప్పుడు, బోర్డింగ్ పాస్లో సీట్ల నంబర్లు మారిపోయినట్లు తెలిసింది. వినీత్, ఆయన భార్యకు మాత్రమే ప్రీమియం ఎకానమీ సీట్లు కేటాయించగా, విమానం పూర్తిగా నిండిపోవడంతో మిగిలిన నలుగురు స్నేహితులకు వేరే సాధారణ సీట్లు ఇచ్చారు.
దీంతో స్నేహితుల ముందు తీవ్ర ఇబ్బందికి, మానసిక వేదనకు గురైన వినీత్ విమానయాన సంస్థకు ఫిర్యాదు చేశారు. తమ తప్పును అంగీకరించిన సంస్థ, అదనంగా వసూలు చేసిన రూ.4,620ని తిరిగి చెల్లిస్తామని, అదనంగా రూ.500 విలువైన వౌచర్ ఇస్తామని తెలిపింది. అయితే, దీనిని అంగీకరించని వినీత్ జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. కేసును విచారించిన కమిషన్, ఆ మొత్తాన్ని 9 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని, పరిహారంగా రూ.9,000 ఇవ్వాలని ఆదేశించింది.
ఈ పరిహారం చాలా తక్కువని పేర్కొంటూ వినీత్ చండీగఢ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో అప్పీల్ చేశారు. పిటిషన్ను విచారించిన కమిషన్ అధ్యక్షుడు రాజ్ శేఖర్ అత్రి, సభ్యుడు ప్రీతీందర్ సింగ్లతో కూడిన ధర్మాసనం, డబ్బులు తిరిగి ఇవ్వడం ద్వారానో లేదా రూ.500 వౌచర్ ఇవ్వడం ద్వారానో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని, అవమానాన్ని పూడ్చలేమని స్పష్టం చేసింది.
ప్రయాణికులు తమ సౌలభ్యం, శరీర ఆకృతిని బట్టి అదనపు స్థలం ఉన్న సీట్లను ఎంచుకుంటారని, ఇద్దరికి మాత్రమే సీట్లను అప్గ్రేడ్ చేసినంత మాత్రాన మిగిలిన నలుగురికి చేసిన సేవా లోపం నుంచి విమానయాన సంస్థ తప్పించుకోలేదని కమిషన్ పేర్కొంది. అనంతరం, జిల్లా కమిషన్ విధించిన రూ.9,000 పరిహారాన్ని రూ.30,000కి పెంచుతూ రాష్ట్ర కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాకుండా, ఇప్పటికే చెల్లించిన రూ.4,620ని ఏడాదికి 9 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని, ఈ ఉత్తర్వుల ప్రతి అందిన 45 రోజుల్లోగా ఆ మొత్తాన్ని చెల్లించకపోతే 12 శాతం వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని కమిషన్ కఠిన ఆదేశాలు జారీ చేసింది. డబ్బులు చెల్లించి ఖరారు చేసుకున్న సీట్లను చివరి నిమిషంలో మార్చే విమానయాన సంస్థల సేవా లోపాలకు వ్యతిరేకంగా ప్రయాణికులు చట్టపరంగా పరిహారం పొందవచ్చనడానికి ఈ తీర్పు ఒక చక్కని ఉదాహరణగా నిలిచింది.

Leave a Reply