మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ముంబ్రా రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ స్వీట్ షాప్‌లో కొనుగోలు చేసిన స్వీట్ తిన్న ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 35 ఏళ్ల జుబేర్ అన్సారీ అనే వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన నలుగురు ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. ముంబ్రా రైల్వే స్టేషన్ సమీపంలోని ‘సాగర్ స్వీట్స్’ అనే దుకాణంలో అఫ్లాతూన్ అనే స్వీట్‌ను ఐదుగురు కొనుగోలు చేసి తిన్నారు. కొద్దిసేపటికే వారందరికీ అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మృతుడు జుబేర్ అన్సారీ సోదరులు సుహైల్ అన్సారీ, సల్మాన్ అన్సారీ మాట్లాడుతూ.. స్వీట్ తిన్న కొద్దిసేపటికే ఐదుగురూ అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. మిగిలిన నలుగురు చికిత్సతో కోలుకున్నప్పటికీ, జుబేర్‌ను కోల్పోవడం తమ కుటుంబానికి తీరని బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన దుకాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రంగంలోకి దిగిన అధికారులు..
కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో ముంబ్రా పోలీసులు, ఆహార మరియు ఔషధ పరిపాలన శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ ప్రారంభించారు. ఆహార శాఖ అధికారి ప్రియాంక వైస్ నేతృత్వంలోని బృందం సాగర్ స్వీట్స్ దుకాణంలో తనిఖీలు నిర్వహించింది.
ఈ సందర్భంగా అధికారులు దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. విక్రయించిన అఫ్లాతూన్ స్వీట్ నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు.
అసలు స్వీట్‌లో ఏదైనా కలుషిత పదార్థం ఉందా? దాని వల్లే ఐదుగురు అస్వస్థతకు గురయ్యారా? జుబేర్ మృతికి అదే కారణమా? అనే విషయాలు ఇంకా నిర్ధారణ కాలేదు. ప్రయోగశాల పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే అసలు విషయం వెల్లడయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం పోలీసులు, సంబంధిత అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply