రాష్ట్రంలో చలికాలం (Winter) మొదలైంది. కొన్ని జిల్లాల్లో చలిగాలుల తీవ్రతకు ప్రజలు వణికిపోతున్నారు. చలి నుండి రక్షణ పొందడానికి చాలా మంది స్వెటర్లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట వెచ్చగా ఉండాలని చిన్న పిల్లలు, వృద్ధులు స్వెటర్లు లేదా మందపాటి దుస్తులు ధరించి పడుకుంటున్నారు. అయితే, ఇలా చేయడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాత్రిపూట స్వెటర్ ధరించి నిద్రపోవడం వల్ల కలిగే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నిద్రపోయే సమయంలో మన శరీర ఉష్ణోగ్రత సహజంగానే తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల గాఢ నిద్ర (Deep Sleep) పడుతుంది. అయితే మందపాటి స్వెటర్ ధరించడం వల్ల ఈ సహజ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది.
శరీర ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు – నిద్రకు భంగం: రాత్రిపూట స్వెటర్ ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల మీకు ఉక్కపోతగా అనిపించి నిద్రకు ఆటంకం కలుగుతుంది. సాధారణంగా నిద్రపోవడానికి గది ఉష్ణోగ్రత 18°C నుండి 21°C మధ్య ఉంటే మంచిది. ఉష్ణోగ్రత అంతకంటే పెరిగితే రాత్రంతా అసౌకర్యంగా ఉండి, మరుసటి రోజు అలసటగా, ఏకాగ్రత లోపించినట్లు అనిపిస్తుంది.
చెమట వల్ల డీహైడ్రేషన్: స్వెటర్ ధరించినప్పుడు శరీరం వేడెక్కి, దానిని చల్లబరచడానికి చర్మం చెమటను విడుదల చేస్తుంది. నిరంతరంగా చెమట పట్టడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ (Dehydration) ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల రాత్రిపూట పదేపదే దాహం వేసి నిద్ర చెడిపోతుంది.
చర్మ సమస్యలు: రాత్రంతా చెమట పట్టడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద రావచ్చు. మందపాటి ఉన్ని దుస్తులు చర్మం గాలిని పీల్చుకోకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంది.
రక్త ప్రసరణపై ప్రభావం: బిగుతుగా ఉండే స్వెటర్లు లేదా మందపాటి బట్టలు శరీరంలో రక్త ప్రసరణకు అడ్డంకిగా మారవచ్చు. దీనివల్ల కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం, అలసట కలగవచ్చు. దీర్ఘకాలంలో ఈ అలవాటు గుండె మరియు రక్తనాళాలపై ఒత్తిడిని పెంచుతుంది.
