భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలోనే రద్దయిన తర్వాత మైదానంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.
ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న సమయంలో, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌ను చూసి ఆప్యాయంగా ‘మిచీ’ అని పిలుస్తూ చెయ్యి చాపాడు. దానికి శాంట్నర్ నవ్వుతూ ‘హలో, కెప్టెన్!’ అని చెబుతూ చేయి కలిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపిస్తోంది.
మిచెల్ శాంట్నర్ అన్న ఈ రెండు మాటలు, ఐపీఎల్ 2027 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు మళ్లీ రోహిత్ శర్మకే దక్కనున్నాయా అనే అతిపెద్ద ప్రశ్నను, చర్చను లేవనెత్తాయి. ఎందుకంటే, న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న శాంట్నర్.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున స్టార్ ప్లేయర్‌గా ఆడుతున్నాడు.
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ నుంచి అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకుని, ముంబై ఇండియన్స్ ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యాను పంజాబ్ జట్టుకు ఇచ్చేశారు. హార్దిక్ పాండ్యా వెళ్లిపోవడంతో ముంబై ఇండియన్స్‌ను మళ్లీ నడిపించడానికి 5 సార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉండదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, భారత జట్టులో సీనియర్ ఆటగాడు అనే గౌరవంతోనే శాంట్నర్ అతడిని ‘కెప్టెన్’ అని పిలిచి ఉండొచ్చని ఒక వర్గం వాదిస్తోంది. ఈ సంభాషణపై రోహిత్ శర్మ లేదా ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినప్పటికీ.. వర్షం వల్ల రద్దయిన మ్యాచ్‌లో ఈ రెండు మాటల సంభాషణ క్రికెట్ ప్రపంచానికి ఒక ఆసక్తికరమైన ట్రీట్‌గా మారింది.

Leave a Reply