ఉత్తరప్రదేశ్: సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న 38 ఏళ్ల రేష్మా ఖాన్ అనే వివాహిత, తన ప్రియుడు హేమల్ కకారియా (దిలీప్, 42) చేతిలో అత్యంత క్రూరంగా హత్యకు గురైంది.
ముగ్గురు పిల్లల తల్లైన రేష్మాకు, మధియాహు ప్రాంతంలో ఉంటున్న కకారియా ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు. దీనివల్ల వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. రేష్మా తన కుటుంబానికి దూరంగా ఎక్కువ సమయం కకారియాతో గడపడం ప్రారంభించింది.
గత జూలై 4న రేష్మా, కకారియా అద్దె ఇంటికి వెళ్లినప్పుడు, ఆమె ఫోన్ చాటింగ్‌కు సంబంధించి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తన ఫోన్‌ను తనిఖీ చేయాలని కకారియా కోరగా, ఆమె నిరాకరించడంతో ఆగ్రహించిన కకారియా రేష్మా గొంతు కోసి చంపేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని మాయం చేసేందుకు, అతను మార్కెట్ నుంచి మాంసం కోసే కత్తి, నల్లటి ప్లాస్టిక్ కవర్లు కొనుక్కొచ్చి, మృతదేహాన్ని ముక్కలుగా కోసి కవర్లలో ప్యాక్ చేశాడు.
ఆదివారం ఉదయం రాణిపూర్ బైపాస్ రోడ్డు సమీపంలోని పొదల్లో మహిళా మృతదేహం ముక్కలను గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మిగిలిన శరీర భాగాలను తరలించడానికి ప్రయత్నిస్తున్న కకారియాను రాంనగర్ ఎంట్రన్స్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అతను జరిపిన కాల్పులకు పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో కకారియా గాయపడి అర్ధరాత్రి పోలీసులకు చిక్కాడు. అతని వద్ద నుంచి నాటు తుపాకీ, తూటాలు, హత్యకు ఉపయోగించిన కత్తి మరియు మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
