ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తూ, ఇరాన్ హార్ముజ్ జలసంధి ద్వారాలను మూసివేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణం తర్వాత జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు పశ్చిమ ఆసియాను పేలుడు అంచుకు చేర్చాయి. ప్రపంచ ఇంధన సిరగా పిలవబడే ఈ మార్గం గుండా “ఇకపై ఒక్క ఓడను కూడా పోనివ్వం” అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) చేసిన ప్రకటన కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, అమెరికా ఆధిపత్యంపై ఇరాన్ చేసిన బలమైన దాడి.
చైనా వంటి దేశాలకు ఇది పెద్ద సవాలుగా మారింది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో 80% కొనుగోలు చేసే చైనా, ఇప్పుడు రష్యా వైపు మొగ్గు చూపుతోంది. ఫిబ్రవరి 2026 గణాంకాల ప్రకారం, ఇరాన్ నుండి దిగుమతులు తగ్గించి, రష్యా నుండి రోజుకు 2.07 మిలియన్ బారెల్స్ చమురును చైనా కొనుగోలు చేస్తోంది. వెనిజులాలో అమెరికా జోక్యం, నికోలస్ మదురో అరెస్ట్ వంటి పరిణామాలు కూడా చైనా-రష్యా సంబంధాలను బలపరిచాయి.
హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల రోజుకు 20 మిలియన్ బారెల్స్ చమురు సరఫరా నిలిచిపోతుంది. దీనివల్ల చమురు ధరలు బారెల్‌కు 150 డాలర్ల పైకి చేరుకోవచ్చు. ఇది కేవలం పశ్చిమ ఆసియా సమస్య మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చీకటి యుగంలోకి నెట్టేసే ప్రమాదం ఉంది. ట్రంప్ యుద్ధ కాంక్ష, ఇరాన్ ప్రతిఘటన మధ్య ప్రపంచం ఇప్పుడు ఊపిరి బిగబట్టి చూస్తోంది.

Leave a Reply