ఒకే ఒక్క ఉద్యోగం కోసం వందలాది మంది పోటీ పడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ (ప్రారంభ స్థాయి) ఉద్యోగాలకు కూడా తగిన అర్హతలు, డిగ్రీలు ఉన్నప్పటికీ అవకాశం దొరకడం కష్టంగా మారుతోంది. ఒకవైపు లేఆఫ్‌లు (ఉద్యోగ కోతలు) పెరుగుతున్న నేపథ్యంలో, ఉద్యోగాన్వేషకులకు సవాళ్లు మరింత పెరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే, రెడిట్ (Reddit) వేదికగా ఓ యువకుడు తన ఉద్యోగాన్వేషణ అనుభవాన్ని పంచుకున్నాడు. ఓ ఎంట్రీ-లెవల్ ఉద్యోగానికి సుమారు 300 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో కేవలం 50 మంది దరఖాస్తులను మాత్రమే అర్హమైనవిగా ఎంపిక చేశారని తెలిపాడు. ఆ తర్వాత మొదటి రౌండ్ ఇంటర్వ్యూకు కేవలం 6 మందిని మాత్రమే పిలిచారు. తుది రౌండ్‌కు ఇద్దరు మాత్రమే చేరుకున్నారు. అంటే, దరఖాస్తు చేసుకున్న 300 మందిలో కేవలం 2 శాతం మందికి మాత్రమే ఇంటర్వ్యూ అవకాశం దక్కింది.
ఈ పరిస్థితిని అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ అడ్మిషన్లతో అతను పోల్చాడు. హార్వర్డ్‌లో సీటు దొరికే అవకాశం సుమారు 4 శాతం ఉండగా, తాను దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి మొదటి రౌండ్ ఇంటర్వ్యూ అవకాశం కేవలం 2 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నాడు. గత 18 నెలలుగా ఉద్యోగం కోసం వెతుకుతున్నానని, తుది రౌండ్ వరకు వెళ్లడం సంతోషాన్నిచ్చినా, ప్రారంభ స్థాయి జీతం ఉండే ఉద్యోగానికే ఇంతటి పోటీ ఉండటం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ పోస్టుకు చాలా మంది నెటిజన్లు తమ అనుభవాలను పంచుకున్నారు. తుది రౌండ్ ఇంటర్వ్యూ వరకు వెళ్లినప్పటికీ, తమకంటే ఎక్కువ అనుభవం ఉన్నవారికే కంపెనీ ప్రాధాన్యత ఇవ్వడంతో ఉద్యోగం రాలేదని ఒకరు తెలిపారు. కనీసం ఒక బెడ్రూమ్ ఇంటి అద్దె కట్టుకోగలిగే జీతం వచ్చే ఉద్యోగాన్ని పొందడం కూడా లాటరీ గెలవడం లాగే ఉందని మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి, జాబ్ మార్కెట్లో పెరుగుతున్న పోటీ, తగ్గుతున్న అవకాశాలు ఉద్యోగాన్వేషకుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

Leave a Reply