న్యూఢిల్లీ: ఢిల్లీలోని మహిపాల్‌పూర్ ఫ్లైఓవర్పై ఒక యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సమయంలో.. అక్కడ ఉన్న ఢిల్లీ పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ అనిల్ శర్మ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అతని ప్రాణాలను కాపాడారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో వైరల్‌గా మారింది. ఆ క్లిష్ట సమయంలో సదరు పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు, చూపిన ఓపికపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆత్మహత్యకు సిద్ధమైన ఆ యువకుడిని అస్సలు భయపెట్టకుండా, చాలా నిదానంగా మాట్లాడుతూ.. మొదట అతని నమ్మకాన్ని సబ్-ఇన్‌స్పెక్టర్ గెలుచుకున్నారు.
సమయోచిత బుద్ధితో ప్రాణ రక్షణ..
ఆ తర్వాత అతనికి తాగడానికి మంచినీరు ఇచ్చి, మాట్లాడటానికి తన మొబైల్ ఫోన్‌ను కూడా అతని చేతికి అందించి.. ఆ యువకుడి దృష్టిని పూర్తిగా మళ్లించారు. సరైన సమయం కోసం వేచి చూసిన సబ్-ఇన్‌స్పెక్టర్ అనిల్ శర్మ, ఆ యువకుడు ఏమాత్రం ఊహించని విధంగా ఒక్కసారిగా అతడిని గట్టిగా కౌగిలించుకుని, ఫ్లైఓవర్ అంచు నుండి సురక్షితంగా వెనుకకు లాగేశారు.
ఇది చూసి అంతవరకు ఊపిరి బిగబట్టి నిల్చున్న చుట్టుపక్కల ప్రజలు వెంటనే పరుగున వచ్చి ఆ యువకుడిని కాపాడారు. అంతటి ఉద్రిక్త వాతావరణంలో కూడా కంగారు పడకుండా, ఎంతో ఓపికతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక అమూల్యమైన ప్రాణాన్ని కాపాడిన తన అధికారిని ఢిల్లీ పోలీస్ శాఖ హృదయపూర్వకంగా అభినందించింది.

Leave a Reply