ఉత్తరాఖండ్ రాష్ట్రం మున్సియారీలోని పంచచూలి మంచు పర్వత శ్రేణుల వెనుక నుండి చందమామ నెమ్మదిగా పైకి ఉదయిస్తున్న అందమైన దృశ్యం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
మంచుతో కప్పబడిన కొండల వెనుక ప్రకాశవంతంగా కనిపిస్తున్న చంద్రుని ఈ దృశ్యాన్ని చూసిన పలువురు పులకించిపోయారు. ఈ వీడియోను ఇప్పటివరకు సుమారు 20 లక్షల మంది వీక్షించారు.
ఈ అద్భుతమైన క్షణాన్ని సాగర్ ఆగ్రి అనే వ్యక్తి తన కెమెరాలో బంధించి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. సాధారణంగా మనం సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూస్తుంటాం. కానీ, పర్వతాల వెనుక నుండి చందమామ పైకి రావడం చూడటం చాలా అరుదైన అనుభవమని ఆయన వీడియోలో పేర్కొన్నారు. నేరుగా చూసినప్పుడు చందమామ మరింత అందంగా కనిపించిందని, దానిని తన మొబైల్ కెమెరాలో పూర్తిగా బంధించలేకపోయానని తెలిపారు.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మొబైల్ కెమెరా ఈ అందాన్ని పూర్తిగా చూపించలేదని, నేరుగా చూసి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేదని పలువురు అభిప్రాయపడ్డారు. మరికొందరు తాము కూడా పంచచూలి పర్వతాల వెనుక చంద్రోదయాన్ని చూసిన అనుభవాలను పంచుకున్నారు.
ఈ దృశ్యంలో కనిపిస్తున్న చంద్రుడు, నవంబర్ నెల పౌర్ణమి రోజున కనిపించే ‘బీవర్ సూపర్ మూన్’ (Beaver Supermoon). చంద్రుడు భూమికి అతి సమీపంలోకి వచ్చినప్పుడు పౌర్ణమి ఏర్పడితే, అది సాధారణం కంటే కాస్త పెద్దదిగా, మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోరాగఢ్ జిల్లాలో ఉన్న మున్సియారీ, పంచచూలి పర్వత శ్రేణుల రమణీయ దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం.

Leave a Reply