మధ్యప్రదేశ్‌లో అరుదైన వన్యప్రాణుల తరలింపు చర్య ప్రారంభమైంది. హెలికాప్టర్ల సాయంతో కృష్ణజింకలను సురక్షితంగా పట్టుకుని మరో ప్రాంతానికి తరలిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో వ్యవసాయ పంటలను దెబ్బతీస్తున్నాయని చెబుతున్న కృష్ణజింకలను సురక్షితంగా మరో ప్రాంతానికి తరలించే కార్యక్రమాన్ని అటవీశాఖ ప్రారంభించింది.
ఈ చర్యలో భాగంగా తొలిరోజు 100 కృష్ణజింకలను పట్టుకోగా, వాటిలో 97 జింకలను కునో జాతీయ పార్కుకు తరలించారు. మొత్తం 2,000 కృష్ణజింకలను తరలించడమే లక్ష్యంగా అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన 14 మంది వన్యప్రాణి నిపుణులు పాల్గొంటున్నారు. హెలికాప్టర్ సాయంతో జింకలను ఒక నిర్దిష్ట దిశలోకి మళ్లించి, వాటిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆవరణలోకి తీసుకువస్తున్నారు. ఈ పద్ధతిని ‘బోమా’ సాంకేతికత అని పిలుస్తారు. అనంతరం జింకలను ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు.
ఈ భారీ ఆపరేషన్‌లో అటవీశాఖ అధికారులు, పశువైద్యులు, పోలీసు సిబ్బంది సహా సుమారు 200 మంది పాల్గొంటున్నారు.
గత ఏడాది చేపట్టిన మొదటి దశలో 846 కృష్ణజింకలు, 67 నీల్గాయ్లను కలిపి మొత్తం 913 వన్యప్రాణులను ఇతర ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం రెండో దశ కార్యక్రమం కొనసాగుతోంది.
జంతువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో నిపుణుల సూచన మేరకు తరలింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితులు అనుకూలించిన తర్వాత మళ్లీ ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించారు.
ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 31 వరకు కొనసాగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవైపు రైతుల పంటలను కాపాడటం, మరోవైపు వన్యప్రాణులను సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలించడం ఈ చర్య ప్రధాన ఉద్దేశం.
ఇదిలా ఉండగా, ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజలు పొలాల్లోకి వెళ్లవద్దని, హెలికాప్టర్ శబ్దాలు విని గుంపులుగా అక్కడికి చేరుకోవద్దని అధికారులు సూచించారు.

Leave a Reply