ఈ రోజుల్లో ప్రయాణాలు (Travelling) చేయడం చాలా మందికి అలవాటుగా మారింది. ఫలితంగా ప్రతి నగరంలోనూ తక్కువ ధర నుండి భారీ ధర వరకు అనేక హోటళ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఒక హోటల్ రూమ్‌లో (Hotel Rooms) అన్నిటికంటే అత్యంత మురికి వస్తువు ఏది అని మీకు తెలుసా?
బహుశా మీరు దిండు, పక్క బట్టలు లేదా టాయిలెట్ అని సమాధానం చెప్పవచ్చు. కానీ అది నిజం కాదు! ఆ మురికి వస్తువు ఏంటో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు.
హోటల్లో ఉండే అత్యంత మురికి వస్తువు:
హోటల్‌కు వెళ్లినప్పుడు మీ గదిలో మీరు తరచూ ఉపయోగించే ఒక వస్తువు ఉంది, అదే అన్నిటికంటే ప్రమాదకరమైనది. మేము మాట్లాడుతోంది ఎలక్ట్రిక్ కెటిల్ (Electric Kettle) గురించి. హోటల్ గదుల్లో టీ, కాఫీ తయారు చేసుకోవడానికి లేదా నీటిని వేడి చేసుకోవడానికి దీనిని ఇస్తారు. ఒక మాజీ హోటల్ ఉద్యోగి చెప్పిన మాటలు వింటే మీరు దీనిని వాడటం ఇప్పటికిప్పుడే మానేస్తారు.
కెటిల్లో అంత మురికి ఏముంది?
ఆరేళ్ల అనుభవం ఉన్న ఒక మాజీ హోటల్ ఉద్యోగి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కెటిళ్లను ఏళ్ల తరబడి సరిగ్గా శుభ్రం చేయరు. గదిని క్లీన్ చేసే సిబ్బంది కేవలం కెటిల్‌ను పైపైన తుడుస్తారు తప్ప, లోపల ఏముందో ఎప్పుడూ పరిశీలించరు. దీనికి తోడు హోటల్‌కు వచ్చే కొందరు అతిథులు ఇందులో వింత పనులు చేస్తారట.
సాక్స్, లోదుస్తులు ఉడికించే అతిథులు!
హోటల్‌కు వచ్చే చాలా మంది అతిథులు తమ లోదుస్తులను లేదా సాక్స్‌లను శుభ్రం చేయడానికి ఈ ఎలక్ట్రిక్ కెటిల్స్‌లో వేసి ఉడికిస్తారట. అలా చేయడం వల్ల బ్యాక్టీరియా చనిపోతుందని వారి నమ్మకం. మరికొన్ని సందర్భాల్లో కెటిల్లో నూడుల్స్ అంటుకుపోయి ఉండటం లేదా ఎవరో సూప్ వేడి చేయడం వల్ల కెటిల్ మొత్తం ఆహారం వాసన రావడం వంటివి జరుగుతుంటాయి.
ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ ఇదే పరిస్థితి:
ఈ విషయాలు 2025లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. కేవలం చిన్న హోటళ్లు మాత్రమే కాదు, 5 స్టార్ హోటళ్లలోనూ ఇలాంటి సమస్యలు సర్వసాధారణమని ట్రావెల్ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కెటిల్ పగిలిపోయినప్పుడు లేదా పనిచేయనప్పుడు మాత్రమే హోటల్ యాజమాన్యం దానిని మారుస్తుంది తప్ప, డీప్ క్లీనింగ్ అనేదే ఉండదు.
ఆరోగ్యానికి ప్రమాదం:
నీటిని మరిగించడం వల్ల బ్యాక్టీరియా చనిపోవచ్చు, కానీ అంతకుముందు అందులో వాడిన కెమికల్స్, సోప్ లేదా ఇతర వ్యర్థాలు అలాగే ఉండిపోతాయి. దీనివల్ల మీరు తాగే టీ లేదా కాఫీ వింత రుచి రావడమే కాకుండా, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
హోటల్ గదిలో ఇతర సమస్యలు:
మురికి కేవలం కెటిల్స్కే పరిమితం కాలేదు. గదిలో ఉండే గ్లాసులను కూడా సరిగ్గా సోప్ వేసి కడగకుండా కేవలం నీళ్లతో కడిగి పెడుతుంటారు. వేల మంది తాకే టీవీ రిమోట్ కంట్రోల్స్, నెలల తరబడి ఉతకని బెడ్ స్ప్రెడ్స్ కూడా అత్యంత మురికిగా ఉంటాయి. అయితే వీటన్నిటిలోనూ కెటిల్స్ వాడటం అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
