ముంబై: భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), తన వద్ద ఉన్న సుమారు ₹10 లక్షల కోట్ల విలువైన గృహ రుణాల (హోమ్ లోన్) పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని బాండ్లు/పత్రాలుగా (Securitization) మార్చి, విదేశీ పెట్టుబడిదారులకు విక్రయించేందుకు తీవ్రంగా పరిశీలిస్తోందని ఎస్‌బీఐ ఛైర్మన్ సి.ఎస్. శెట్టి ధృవీకరించారు.
అసలు బ్యాంక్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది..? దీనివల్ల సామాన్య ప్రజలు తీసుకున్న హోమ్ లోన్లపై ఏమైనా ప్రభావం పడుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
ఎందుకీ నిర్ణయం?
గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలోని అన్ని బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి కంటే రుణాల (లోన్ల) వృద్ధి చాలా ఎక్కువగా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ రుణ వృద్ధి 16.9%గా నమోదు కాగా, డిపాజిట్ల వృద్ధి కేవలం 11% మాత్రమే ఉంది. బ్యాంకులకు డిపాజిట్లే అతిపెద్ద ఆర్థిక వనరుగా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఈ డిపాజిట్ల వృద్ధి తగ్గుతుండటంతో, బ్యాంకులు నిధుల సమీకరణ కోసం కొత్త మార్గాలను అన్వేషించడం ప్రారంభించాయి.
ఉదాహరణకు, ఎస్‌బీఐ ఒక కస్టమర్‌కు 20 సంవత్సరాల కాలపరిమితితో హోమ్ లోన్ ఇచ్చినప్పుడు, ఆ డబ్బు సుదీర్ఘకాలం పాటు బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌లోనే ఉండిపోతుంది. దీనివల్ల కొత్త రుణాల జారీకి బ్యాంక్ వద్ద నిధుల కొరత ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి, తన వద్ద ఉన్న హోమ్ లోన్లను ఒక ప్యాకేజీగా మార్చి, బాండ్ల రూపంలో విదేశీ లేదా బయటి పెట్టుబడిదారులకు విక్రయించాలని ఎస్‌బీఐ యోచిస్తోంది.
దీని ద్వారా ఇప్పటికే ఉన్న గృహ రుణాలను లీగల్ ఆధారంగా చేసుకుని కొత్త పెట్టుబడులను ఆకర్షించవచ్చు. దీనివల్ల బ్యాంకుకు, రుణం తీసుకున్న కస్టమర్లకు మధ్య ఉన్న సంబంధంలోగానీ, యాజమాన్య హక్కుల్లోగానీ ఎలాంటి మార్పు ఉండదు. బ్యాంకులు కేవలం ప్రజల ఆస్తుల రుణ పత్రాలను సెక్యూరిటీగా వాడుకుంటూ నిధులను సమీకరిస్తాయి.
సెక్యూరిటైజేషన్ (Securitization) అంటే ఏమిటి?
బ్యాంక్ తన వద్ద ఉన్న గృహ రుణాలన్నింటినీ క్రోడీకరించి, వాటి ఆధారంగా బాండ్లను (Securities) సృష్టిస్తుంది. వీటిని పెన్షన్ ఫండ్‌లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్‌ల వంటి దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు విక్రయిస్తుంది. దీని ద్వారా బ్యాంకుకు తక్షణమే పెద్ద మొత్తంలో నగదు అందుతుంది. ఆ డబ్బును బ్యాంక్ మళ్లీ కొత్తగా హోమ్ లోన్లు ఇవ్వడానికి ఉపయోగించుకోవచ్చు.
భారతదేశంలో ఈ విధానం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. గత ఏడాదిలోనే మొదటిసారిగా ₹1,000 కోట్ల విలువైన హోమ్ లోన్ ఆధారిత బాండ్లను విడుదల చేశారు. ఎల్‌ఐసీ హౌసింగ్ ఇన్సూరెన్స్ జారీ చేసిన ఈ బాండ్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. ఈ బాండ్లకు ‘AAA’ రేటింగ్ లభించింది.
అంటే ఈ బాండ్లలో చేర్చబడిన గృహ రుణాలన్నీ అత్యంత సురక్షితమైనవని అర్థం. ఉదాహరణకు ₹5 కోట్ల విలువైన ఆస్తికి కేవలం ₹1 కోటి రుణం ఇచ్చిన ఖాతాలు, అలాగే మంచి క్రెడిట్ స్కోర్ (CIBIL Score) ఉండి ఎలాంటి డిఫాల్ట్ రిస్క్ లేని రుణాలను మాత్రమే ఏరికోరి ఈ బాండ్ల కోసం ఎంపిక చేస్తారు.
దీనివల్ల ప్రయోజనం ఏంటి?
ఈ విధానం భారతదేశంలో మరింత విస్తరిస్తే, గృహ రుణాల జారీకి బ్యాంకులకు పుష్కలంగా నిధులు లభిస్తాయి. బ్యాంకులు కేవలం డిపాజిట్లపైనే ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. దీనివల్ల హోమ్ లోన్ వడ్డీ రేట్లు అదుపులో ఉండే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే, భవిష్యత్తులో మరింత తక్కువ వడ్డీకే హోమ్ లోన్లు లభించవచ్చు.
ప్రస్తుతం భారతదేశంలో మెజారిటీ హోమ్ లోన్లకు డిపాజిట్ల ద్వారానే నిధులు సమకూరుస్తున్నారు. ఒకవేళ డిపాజిట్ల వృద్ధి తగ్గితే, రుణాలపై వడ్డీ రేట్లు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఎస్‌బీఐ ఈ కొత్త విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తే, అది భారత బ్యాంకింగ్ రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది.
ఈ ప్లాన్ ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఎస్‌బీఐ ఛైర్మన్ సి.ఎస్. శెట్టి దీనిని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు.
