హోర్ముజ్ జలసంధి: అమెరికా మరియు ఇరాన్ మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఇరాన్‌లోని క్విష్మ్ ద్వీపం మరియు బందర్ అబ్బాస్‌లోని సైనిక స్థావరాలపై యుఎస్ సెంట్రల్ కమాండ్ వైమానిక దాడులు నిర్వహించినట్లు ఒక సీనియర్ అమెరికన్ అధికారిని ఉటంకిస్తూ ‘ఫాక్స్ న్యూస్’ నివేదించింది.
ఏప్రిల్ 7న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన మొదటి ఘర్షణ ఇది. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్ళే నౌకలపై దాడులు చేయడానికి ఇరాన్ ఉపయోగిస్తున్న సైనిక వసతులను లక్ష్యంగా చేసుకున్నామని, ఇది కేవలం ఆత్మరక్షణ కోసం చేసిన చర్య మాత్రమేనని అమెరికా సైన్యం స్పష్టం చేసింది. తాము సంఘర్షణను కోరుకోవడం లేదని, అయితే ఇరాన్ దాడులకు ఇది ప్రత్యక్ష సమాధానమని యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.
అమెరికా సైనిక చర్యను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “ప్రేమపూర్వక దాడి” (Lovely attack) అని అభివర్ణించారు. ఇరాన్ తన రెచ్చగొట్టే చర్యలను కొనసాగిస్తే దీనికంటే శక్తివంతంగా తిప్పికొడతామని, శాంతి ఒప్పందంపై సంతకం చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో జరిగిన ఈ దాడి అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.
