మహారాష్ట్రలోని థానే ప్రాంతానికి చెందిన బయాలజీ టీచర్ స్నేహా షెలార్ తన 3 ఏళ్ల కుమారుడు రేయాన్ష్ పుట్టినరోజు కోసం స్థానిక బేకరీలో ‘స్పైడర్‌మ్యాన్’ థీమ్ చాక్లెట్ కేక్‌ను ఆర్డర్ చేశారు.
పిల్లల కోసం చేసే కేక్ కాబట్టి జాగ్రత్తగా తయారు చేయాలని ముందే చెప్పినప్పటికీ.. బేకరీ సిబ్బంది ఘోర నిర్లక్ష్యానికి పాల్పడ్డారు. కేక్ పైన ఉన్న చాక్లెట్ బౌలింగ్ పిన్స్ (Bowling Pins) నేరుగా నిలబడటం కోసం వాటి లోపల ఇనుప చువ్వలను (మేకులను) పెట్టారు.
పుట్టినరోజు వేడుకల సమయంలో వాటిని చాక్లెట్ ముక్కలే అనుకుని 3 ఏళ్ల చిన్నారి రేయాన్ష్.. ఇనుప మేకులు ఉన్న ఆ చాక్లెట్ ముక్కలను మింగేశాడు. మరుసటి రోజు మిగిలిన పిల్లలు చాక్లెట్ లోపల ఇనుప తీగలు ఉండటాన్ని గమనించి ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. కంగారుపడుతూ చిన్నారిని వెంటనే జుపిటర్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు ఎక్స్-రే/స్కాన్ (Scan) పరీక్షలు చేయగా, బాబు చిన్నపేగుల్లో రెండు ఇనుప మేకులు చిక్కుకున్నట్లు తేలింది. అయితే, ఆ మేకులు అప్పటికే పేగుల లోపలి భాగానికి వెళ్ళిపోవడంతో వెంటనే శస్త్రచికిత్స (ఆపరేషన్) చేయకుండా.. అవి మలం ద్వారా సహజంగానే బయటకు వచ్చేస్తాయేమోనని 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు సూచించారు. తల్లిదండ్రులు నరకయాతన అనుభవించిన ఆ 48 గంటల తర్వాత, అదృష్టవశాత్తూ ఆ రెండు ఇనుప మేకులు సహజ పద్ధతిలోనే బయటకు వచ్చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ వ్యవహారం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) పరిధిలోకి వస్తుందని చెప్పారు. అయితే, కేక్ శాంపిల్స్ లేకపోతే తాము దర్యాప్తు చేయలేమని FDA చేతులెత్తేసింది. కాగా, ఈ ఘటన వల్ల ఎదురైన తీవ్ర మానసిక క్షోభకు వినియోగదారుల కోర్టు (Consumer Court) ద్వారా తగిన పరిహారం పొందవచ్చని మహారాష్ట్ర కన్స్యూమర్ కౌన్సిల్ తెలిపింది.

Leave a Reply