పిల్లలు ఏడుస్తుంటే వారిని ఊరడించడానికి తల్లిదండ్రులు చేసే మొదటి పని వారి చేతిలో బిస్కెట్ ప్యాకెట్ పెట్టడం. ముఖ్యంగా టీ కొట్టుకు వెళ్లినప్పుడు, మనం ముచ్చట్లలో పడి పిల్లలకు ఒక క్రీమ్ బిస్కెట్ కొనిస్తాం. ఆ బిస్కెట్ మధ్యలో ఉన్న క్రీమ్‌ను పిల్లలు ఎంతో ఇష్టంగా నాకి తినడం చూసి మనం మురిసిపోతాం. కానీ, ఆ ఆనందం వెనుక ఉన్న ప్రమాదాన్ని మనం గుర్తించడం లేదు. మనం ప్రేమతో తినిపిస్తున్నది ఆహారం కాదు, అది ఒక ‘స్లో పాయిజన్’ (నెమ్మదిగా చంపే విషం).
వెన్న కాదు.. వనస్పతి! ప్రకటనల్లో చూపించినట్లుగా ఆ బిస్కెట్ల మధ్యలో ఉండేది పాలు లేదా వెన్న కాదు. అది వనస్పతి (డాల్డా) మరియు చౌకబారు నూనెలు, పంచదారల మిశ్రమం. ఆకర్షణీయమైన రంగులు, కృత్రిమ రుచులు కలిపిన ఆ క్రీమ్ తినడం అంటే నేరుగా చెడు కొలెస్ట్రాల్‌ను శరీరంలోకి పంపడమే.
మైదాతో ముప్పు: బిస్కెట్లు పూర్తిగా మైదాతో తయారవుతాయి. ఇది పేగులకు అతుక్కుని జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. ఇందులో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ చిన్న వయసులోనే రక్తపోటు మరియు గుండె జబ్బులకు పునాది వేస్తాయి. పిల్లల్లో ఊబకాయం (రావడానికి) రావడానికి ప్రధాన కారణం ఇవే. బిస్కెట్లలో ఉండే అధిక చక్కెర పిల్లల మెదడును వీటికి బానిసలుగా చేస్తుంది, తద్వారా వారు కూరగాయలు, పండ్లు వంటి పోషకాహారాన్ని తినడానికి ఇష్టపడరు.
ప్రత్యామ్నాయ మార్గాలు: బిస్కెట్లు నెలల తరబడి పాడవకుండా ఉండటానికి కలిపే రసాయనాలు పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల ఏకాగ్రత తగ్గడం, కోపం రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి, ప్యాకెట్ ఫుడ్స్ మానేసి మన సంప్రదాయ చిరుతిళ్లయిన పల్లీ పట్టీలు (చెక్కీలు), నువ్వుల ఉండలు లేదా ఇంట్లో తయారుచేసిన రాగి, జొన్న బిస్కెట్లను పిల్లలకు అలవాటు చేయాలి.
