₹13 కోట్లు పెట్టి కొన్న స్టార్ ప్లేయర్‌ను డగౌట్‌కే పరిమితం చేయడం సన్‌రైజర్స్ చేసిన అతిపెద్ద తప్పా?

ఐపీఎల్ 2026 SRH భారీ తప్పిదం: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2026 సీజన్‌ను అత్యంత దారుణంగా ప్రారంభించింది. ఈ సీజన్‌లో ఏదో సాధిస్తుందని ఆశించిన అభిమానులకు, మొదటి మ్యాచ్‌తోనే జట్టు పరిస్థితి ఏంటో అర్థమైపోయింది.

ఆర్సీబీ (RCB) చేతిలో ఓటమి తర్వాత, ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులకు 2025 నాటి పరిస్థితులే పునరావృతమవుతాయని స్పష్టమైంది. 2024లో అద్భుతంగా ఆడిన ఈ జట్టు, 2025లో పేలవమైన బౌలింగ్ కారణంగా విఫలమైంది. ఇప్పుడు 2026లో కూడా అదే బలహీనమైన బౌలింగ్ వల్ల ఓటమి పాలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్సీబీపై 201 పరుగులు చేసినప్పటికీ, బౌలర్లు దానిని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. ప్రస్తుతం లీగ్‌లో అత్యంత బలహీనమైన బౌలింగ్ విభాగం ఎవరిదైనా ఉందంటే అది సన్‌రైజర్స్‌దే. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్‌లపైనే జట్టు ఆధారపడుతోంది.

లియామ్ లివింగ్‌స్టోన్ ఎక్కడ? ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టు ఎంపిక విచిత్రంగా ఉంది. వేలంలో ₹13 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్‌ను బెంచ్‌కే పరిమితం చేశారు. బ్రెండన్ కార్సే జాడ లేదు. కనీసం ఇంపాక్ట్ ప్లేయర్‌గా కూడా లివింగ్‌స్టోన్‌ను వాడుకోకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుది జట్టులో లేనప్పుడు అంత భారీ ధర పెట్టి ఎందుకు కొన్నారని ప్రశ్నిస్తున్నారు.

రవి బిష్ణోయ్ విషయంలో పొరపాటు: మినీ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ విడుదల చేసిన రవి బిష్ణోయ్ అందుబాటులో ఉన్నాడు. రషీద్ ఖాన్ వెళ్ళిపోయిన తర్వాత ఎస్‌ఆర్‌హెచ్ స్పిన్ విభాగం చాలా బలహీనపడింది. బిష్ణోయ్ వంటి నాణ్యమైన స్పిన్నర్ వేలంలోకి వచ్చినప్పుడు అతన్ని దక్కించుకోవాల్సింది. కానీ ఎస్‌ఆర్‌హెచ్ ₹7 కోట్ల వద్ద బిడ్డింగ్ ఆపేసింది. చివరకు రాజస్థాన్ రాయల్స్ అతన్ని ₹7.20 కోట్లకు దక్కించుకుంది. మరో ₹2-3 కోట్లు ఖర్చు చేసి ఉంటే బిష్ణోయ్ హైదరాబాద్ జట్టులో ఉండేవాడు.

బిష్ణోయ్ వంటి స్పిన్నర్ కంటే లివింగ్‌స్టోన్ కోసం ₹13 కోట్లు ఖర్చు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. కనీసం బ్యాటింగ్ సమయంలో హర్ష్ దూబే అవుట్ అయిన తర్వాత 3 ఓవర్లు మిగిలి ఉండగానే లివింగ్‌స్టోన్‌ను పంపి ఉంటే స్కోరు మరో 20 పరుగులు పెరిగేది. పైగా అతను లెగ్ స్పిన్ కూడా వేయగలడు. ఆకాష్ చోప్రా చెప్పినట్లుగా.. ఎస్‌ఆర్‌హెచ్ 250 పరుగులు చేసినా, వారి బౌలింగ్ బలహీనత వల్ల ఓడిపోయే ప్రమాదం ఉందని అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.


Posted

in

by

Tags: