సాధారణంగా 1.5 టన్ ఏసీ గంటకు సుమారు 1 నుండి 1.5 యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుంది. అయితే, ఇది మీ ఏసీ రకం (ఇన్వర్టర్ లేదా నాన్-ఇన్వర్టర్), స్టార్ రేటింగ్ మరియు గది ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది.
ఇన్వర్టర్ ఏసీతో పొదుపు: ఇన్వర్టర్ ఏసీలు గది అవసరానికి అనుగుణంగా తమ వేగాన్ని సర్దుబాటు చేసుకుంటాయి కాబట్టి తక్కువ విద్యుత్తును ఖర్చు చేస్తాయి. మీరు 5 స్టార్ ఇన్వర్టర్ మోడల్‌ను ఉపయోగిస్తుంటే, అది సగటున గంటకు 1.2 యూనిట్ల విద్యుత్తును తీసుకుంటుంది. అదే పాత మోడల్ లేదా నాన్-ఇన్వర్టర్ ఏసీ అయితే ఈ వినియోగం ఇంకా ఎక్కువగా ఉంటుంది.
రాత్రంతా వాడితే లెక్క ఇలా.. ఒకవేళ మీరు ఏసీని రాత్రిపూట వరుసగా 7 నుండి 8 గంటల పాటు నడిపితే, మొత్తం విద్యుత్ వినియోగం సుమారు 10 నుండి 14 యూనిట్ల మధ్య ఉండవచ్చు. ఉదాహరణకు, మీ ఏసీ గంటకు 1.2 యూనిట్లు తీసుకుంటే, రాత్రంతా సుమారు 9 నుండి 10 యూనిట్లు ఖర్చవుతుంది. గది ఉష్ణోగ్రతను మరీ తక్కువగా (16 లేదా 18 డిగ్రీలు) సెట్ చేయడం లేదా పదే పదే తలుపులు తీయడం వల్ల ఈ యూనిట్ల సంఖ్య పెరగవచ్చు.
నెలకు ఎంత ఖర్చవుతుంది? విద్యుత్ యూనిట్ ధర సగటున రూ. 8 అని అనుకుంటే, ఒక రాత్రికి ఏసీ బిల్లు రూ. 80 నుండి రూ. 100 వరకు ఉంటుంది. ఇదే పద్ధతిలో నెల మొత్తం వాడితే, కేవలం ఏసీ వల్లనే మీ బిల్లు రూ. 2,500 నుండి రూ. 3,000 వరకు అదనంగా వచ్చే అవకాశం ఉంది.
బిలు తగ్గించుకోవడానికి చిట్కాలు:
- ఉష్ణోగ్రత: ఏసీ ఉష్ణోగ్రతను 24 నుండి 26 డిగ్రీల మధ్య ఉంచడం ఆరోగ్యానికి మరియు జేబుకు కూడా మంచిది.
- తలుపులు, కిటికీలు: చల్లని గాలి బయటకు వెళ్లకుండా గదిని పూర్తిగా మూసి ఉంచాలి.
- ఫిల్టర్ క్లీనింగ్: ఏసీ ఫిల్టర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. మురికి పట్టిన ఫిల్టర్ల వల్ల మిషన్ పై ఒత్తిడి పడి ఎక్కువ విద్యుత్ ఖర్చవుతుంది.
- సీలింగ్ ఫ్యాన్: ఏసీతో పాటు తక్కువ వేగంతో సీలింగ్ ఫ్యాన్ వాడటం వల్ల గది త్వరగా చల్లబడుతుంది, తద్వారా ఏసీపై భారం తగ్గుతుంది.
