బెంగళూరుకు చెందిన ఒక క్యాబ్ డ్రైవర్ తాను ఎదుర్కొంటున్న పని ఒత్తిడి, జీవన ప్రమాణాలు మరియు ఉబర్, రాపిడో వంటి యాప్‌ల వల్ల పడుతున్న ఇబ్బందుల గురించి పెట్టిన పోస్ట్ ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ల కంటికి కనిపించని వేదనను బయటపెట్టింది.
గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో యాప్ ఆధారిత కార్మికుల (గిగ్ వర్కర్స్) సంఖ్య 1.2 కోట్లకు పెరిగింది. వీరికి ఎటువంటి ఉద్యోగ భద్రత ఉండదు. కేవలం రోజువారీ కూలీల మాదిరిగా, ఎక్కువ సమయం పనిచేస్తూ తక్కువ వేతనంతో బతుకీడుస్తున్నారు.
బెంగళూరు డ్రైవర్ ఆవేదన: “ఒకటిన్నర ఏళ్లుగా ఉద్యోగం దొరకకపోవడంతో నేను క్యాబ్ నడపడం ప్రారంభించాను. రాపిడో, ఉబర్ వంటి యాప్‌ల ద్వారా రోజుకు 16 గంటలు కారు నడుపుతున్నాను. రోజుకు రూ. 4,000 ఆదాయం వస్తుంది, కానీ అందులో కారు అద్దెకు రూ. 1,500, ఇంధనానికి రూ. 1,200, ఆహారానికి రూ. 200 ఖర్చవుతాయి. చివరకు నా చేతిలో మిగిలేది కేవలం రూ. 1,000 మాత్రమే.”
“బెంగళూరు ట్రాఫిక్‌లో ఈ ఆదాయం ఏమాత్రం సరిపోదు. దీనికి తోడు నిరంతరం డ్రైవింగ్ చేయడం వల్ల కాళ్లు, నడుము, వెన్నునొప్పి వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రోజుకు 16 గంటలు పని చేస్తూ, కేవలం 6 గంటలు మాత్రమే నిద్రపోతున్నాను. నిజంగా ఒక గాడిదలా చాకిరీ చేస్తున్నాను.”
“కస్టమర్ బుక్ చేసిన 5-6 సెకన్లలోనే కాల్ యాక్సెప్ట్ చేయాలి, లేదంటే రేటింగ్ పడిపోతుంది. పని ముగిసి అలసిపోయి ఇంటికి వచ్చినా కారు కడగాలి, గంటల తరబడి పెట్రోల్ బంకుల్లో వేచి ఉండాలి. ఇది కూడా ఒక జీవితమేనా? కోట్లాది మంది భారతీయుల వాస్తవ పరిస్థితి ఇది. మా చౌక శ్రమ వల్లే ఇతరులు సౌకర్యాలను అనుభవిస్తున్నారు. ఇక్కడ దోపిడీ చేసేవారైనా ఉండాలి లేదా దోపిడీకి గురయ్యేవారైనా ఉండాలి” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
