గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరం పాండేసరా ప్రాంతంలో, ఎలాంటి సరైన వైద్య విద్యార్హత (మెడికల్ డిగ్రీ) లేకుండానే రోగులకు చికిత్స అందిస్తున్న 16 మందిని పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా దాడి చేసి అరెస్ట్ చేశారు.
షాకింగ్ విషయమేమిటంటే.. పట్టుబడిన వారిలో కొందరు కేవలం 10వ లేదా 12వ తరగతి వరకు మాత్రమే చదివారు. మరికొందరైతే ఏకంగా 20 నుండి 33 ఏళ్లుగా దర్జాగా రోగులకు వైద్యం చేస్తున్నారని అధికారులు జరిపిన విచారణలో వెల్లడైంది.
పాండేసరా ప్రాంతంలో పలువురు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు సూరత్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పోలీసులు అనుమానిత క్లినిక్‌లకు సాధారణ పేషెంట్లలాగా కొందరిని పంపించి పక్కా ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత జిల్లా ఆరోగ్య శాఖతో కలిసి ఒకే సమయంలో వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించి 16 మంది నకిలీ డాక్టర్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ తనిఖీల సమయంలో.. కనీస వసతులు లేని సాధారణ చెక్క మంచాలపై రోగులను పడుకోబెట్టి గ్లూకోజ్ ఎక్కిస్తున్న దయనీయ దృశ్యాలు వెలుగుచూశాయి. క్లినిక్‌లలో, పరిసర ప్రాంతాల్లో వాడేసిన సిరంజిలు, మందుల సీసాలు, బయో-మెడికల్ వ్యర్థాలను ఇష్టారాజ్యంగా పడేశారు. ఈ అపరిశుభ్ర వాతావరణం వల్ల రోగులకు తీవ్రమైన ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని అధికారులు గుర్తించారు.
అరెస్టయిన వారి నుంచి దాదాపు ₹1.82 లక్షల విలువైన మందులు, వైద్య పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన విద్యార్హత లేని వ్యక్తుల వద్ద చికిత్స పొందడం రోగుల ప్రాణాలకే ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. ప్రజలు వైద్య సేవల కోసం వెళ్లినప్పుడు డాక్టర్ అర్హత, అధికారిక రిజిస్ట్రేషన్ వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. ఈ ఘటనపై తదుపరి చట్టపరమైన విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.

Leave a Reply