10 పైసలు కూడా రాదు.. బంగారాన్ని భారీగా విక్రయిస్తున్న పెట్టుబడిదారులు.. విపత్తు ముంచుకొస్తోందా?

గత రెండేళ్లుగా ఆగకుండా పెరుగుతూ సామాన్యులకు షాక్ ఇచ్చిన బంగారం ధరలు, ఇప్పుడు తగ్గడం ప్రారంభించాయి. ఈ భారీ పతనం సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు ఈ స్థాయిలో తగ్గడానికి గల కారణాలేంటి? దీని వెనుక ఉన్న అసలు నేపథ్యాన్ని మనం వివరంగా చూద్దాం!

ఒకవైపు ఇరాన్ యుద్ధం ఉగ్రరూపం దాల్చుతోంది. దీనివల్ల మరోవైపు ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బంగారం ధర పెరగాలి. కానీ, దానికి భిన్నంగా బంగారం, వెండి ధరలు చారిత్రాత్మక పతనాన్ని చూస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే బంగారం, వెండి మార్కెట్ విలువ 2 ట్రిలియన్ డాలర్ల మేర కుప్పకూలింది.

బంగారం: బంగారం ఎప్పుడూ సురక్షితమైన పెట్టుబడిగా (Safe Haven) పరిగణించబడుతుంది. అందుకే యుద్ధం వంటి పరిస్థితుల్లో బంగారం ధర పెరుగుతుంది. కానీ ఈసారి విచిత్రంగా ధరలు తగ్గాయి. అది కూడా సాధారణ పతనం కాదు, కోలుకోలేనంతగా పడిపోతున్నాయి. ముఖ్యంగా గోల్డ్ మరియు సిల్వర్ ETFs (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్) ఒకే రోజులో 9 శాతం వరకు క్షీణించాయి. ఈ ఆకస్మిక పతనం అనేక ప్రశ్నలకు, సందేహాలకు దారితీస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా రిస్క్-రివార్డ్ బ్యాలెన్స్‌లో మార్పు వచ్చిందని నిపుణులు అంటున్నారు. యుద్ధం కారణంగా అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి 4.4 శాతానికి పెరిగింది. బంగారం ధర పెరిగితేనే లాభం వస్తుంది, లేకపోతే దాని నుంచి 10 పైసలు కూడా రాదు. అదే ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెడితే ప్రతి నెలా ఒక నిర్దిష్ట ఆదాయం (వడ్డీ) వస్తుంది. బంగారంలో అటువంటి వడ్డీ రాదు, కేవలం ధర పెరిగితేనే లాభం. అందుకే సున్నా లాభం ఇచ్చే బంగారం కంటే, ప్రభుత్వ బాండ్లు పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

డాలర్: యుద్ధం వల్ల అమెరికా డాలర్ బలోపేతం అవుతోంది. బంగారం, వెండి ధరలు డాలర్ విలువపై ఆధారపడి ఉంటాయి కాబట్టి, సురక్షిత పెట్టుబడిగా బంగారానికి ఉన్న క్రేజ్ తగ్గింది. బాండ్ల రాబడి మరియు డాలర్ విలువ పెరగడం వల్ల యుద్ధ సమయంలో కూడా పెట్టుబడిదారులు బంగారాన్ని విక్రయిస్తున్నారు.

మరోవైపు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు స్థిరంగా ఉండటం, చమురు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు కేవలం లోహాల ధరలే తగ్గడం యుద్ధానికి మించిన కొన్ని సమస్యలను సూచిస్తోంది. ముఖ్యంగా ఫ్యూచర్స్ మరియు ETF ట్రేడింగ్‌లో తలెత్తిన చిక్కులు, ‘మార్జిన్ కాల్స్’ కూడా దీనికి ప్రధాన కారణాలు. మార్కెట్‌లో నగదు లభ్యత తగ్గినప్పుడు, సురక్షిత పెట్టుబడి అనే నమ్మకం ఎంత బలహీనపడుతుందో ఇది నిరూపిస్తోంది.

నిపుణులు ఏమంటున్నారు? దీనిపై అనుభవజ్ఞులైన ట్రేడర్లు మాట్లాడుతూ.. “చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో బంగారం అమ్మకాలు జరుగుతున్నాయి. డేటాను చూస్తే అది స్పష్టంగా తెలుస్తోంది. ఇది కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదు, ఒక రకమైన ‘ఫోర్స్డ్ లిక్విడేషన్’ (తప్పనిసరి అమ్మకం). 2 ట్రిలియన్ డాలర్ల నష్టం అనేది మర్మం కాదు, అది ప్రణాళికాబద్ధంగా తీసుకున్న నిర్ణయంలా కనిపిస్తోంది. అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ మూడు వారాల్లో సుమారు 45 బేసిస్ పాయింట్లు పెరిగింది. అందుకే పెట్టుబడిదారులు బంగారాన్ని అమ్మి బాండ్ల వైపు వెళ్తున్నారు” అని తెలిపారు.


Posted

in

by

Tags: