పచ్చి చికెన్ చాలా త్వరగా పాడైపోయే స్వభావం కలది. కాబట్టి దాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే రుచి మారడమే కాకుండా ఫుడ్ పాయిజనింగ్ (ఆహార విషతుల్యత) అయ్యే ప్రమాదం ఉంది.
షాపు నుంచి తీసుకువచ్చిన వెంటనే చికెన్‌ను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచకుండా, వెంటనే ఫ్రిజ్‌లో భద్రపరచడమే దాని తాజాదనాన్ని కాపాడే మొదటి మార్గం.
- సరైన ఉష్ణోగ్రత: అమెరికా వ్యవసాయ శాఖ మార్గదర్శకాల ప్రకారం, ఫ్రిజ్ ఉష్ణోగ్రతను 4°C లేదా అంతకంటే తక్కువగా ఉంచడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా అరికట్టవచ్చు. దీనివల్ల సాధారణ ఫ్రిజ్‌లో 1 నుంచి 2 రోజుల పాటు చికెన్ తాజాగా ఉంటుంది. అలాగే, చికెన్ రసం ఇతర ఆహార పదార్థాలపై పడకుండా ఉండటానికి, ఫ్రిజ్‌లోని అడుగు భాగంలో ఒక గిన్నెలో ఉంచాలి.
- ఎయిర్ టైట్ ప్యాకింగ్: మాంసాన్ని గాలి చొరబడని జిప్-లాక్ బ్యాగుల్లో లేదా ఎయిర్ టైట్ డబ్బాలలో భద్రపరచడం వల్ల తేమ కోల్పోకుండా ఉండటంతో పాటు ఫ్రిజ్ మొత్తం దుర్వాసన రాకుండా ఉంటుంది.
- డీప్ ఫ్రీజర్ నిల్వ: రెండు రోజులకు మించి నిల్వ ఉంచాలనుకుంటే కచ్చితంగా డీప్ ఫ్రీజర్‌లోనే (Freezer) పెట్టాలి. వండే ప్రతిసారీ సులభంగా ఉండటానికి వీలుగా, చికెన్‌ను చిన్న చిన్న భాగాలుగా విభజించి ప్యాక్ చేసుకుని ఫ్రీజర్‌లో పెడితే కావాల్సినంత మాత్రమే బయటకు తీసుకోవచ్చు.
- కడగకుండానే దాచండి: నిల్వ చేయడానికి ముందు చికెన్‌ను నీళ్లతో కడగకూడదు. కడగడం వల్ల దానిలోని బ్యాక్టీరియా కిచెన్ గట్టు, పాత్రలపైకి వ్యాపించే ప్రమాదం ఉంది. వండేటప్పుడు వచ్చే అధిక వేడికే బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది కాబట్టి, కడగకుండా నేరుగా ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో పెట్టడమే సురక్షితం.
- తాజాదనాన్ని గుర్తించడం: ఒకవేళ సరైన రీతిలో నిల్వ చేసినప్పటికీ చికెన్ నుంచి పులిసిన వాసన వచ్చినా, జిగటగా మారినా లేదా రంగు మారినట్లు అనిపించినా దాన్ని వాడకపోవడమే మంచిది.

Leave a Reply