10 ఏళ్ల వయసులోనే అలా..! “కింగ్ కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్”. నాడు చెప్పిన మాట 9 ఏళ్ల తర్వాత నిజమైంది. 19 ఏళ్ల వయసులో తుఫాను వేగం.. ట్రెండింగ్ వీడియో..!

సుమారు తొమ్మిదేళ్ల క్రితం తన పసి చేతుల్లో మైక్ పట్టుకుని అప్పటి భారత క్రికెట్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన ఆ చిన్నోడు.. నేడు భారత క్రికెట్‌లో ఉప్పెనలా ఎదుగుతూ చారిత్రక ఘనత సాధించాడు.

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ (19), అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో యూఏఈ (UAE) జట్టుపై 160 పరుగులు సాధించి హిమాలయమంతటి ఘనతను సొంతం చేసుకున్నాడు.

ఒమన్ దేశంలోని అల్ అమెరత్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆర్యవీర్ సెహ్వాగ్ 168 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లతో 160 పరుగులు బాది తన తొలి అంతర్జాతీయ ‘యూత్ వన్డే’ సెంచరీని నమోదు చేశాడు. అతడికి తోడుగా అద్భుతంగా ఆడిన వి.కె. వినీత్ 67 పరుగులు చేయగా, వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగులు సాధించి, చివరికి 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది.

ఆర్యవీర్ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత, 2017లో ‘స్టార్ స్పోర్ట్స్’ ఛానెల్ కోసం తన తండ్రి సహచర ఆటగాడైన విరాట్ కోహ్లీని అతను ఇంటర్వ్యూ చేసిన పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో, తన తండ్రి సెహ్వాగ్‌ను విరాట్ కోహ్లీ తొలిసారి కలిసిన క్షణం గురించి, అలాగే ఆశిష్ నెహ్రా చేతుల మీదుగా కోహ్లీ బహుమతి అందుకున్న చిన్ననాటి ప్రసిద్ధ ఫోటో గురించి ఆర్యవీర్ ప్రశ్నలు అడిగాడు. అప్పుడు విరాట్ కోహ్లీ చెప్పిన ‘పెద్ద కలలు కనండి, మీ ప్రతిభను నమ్మండి’ అనే సలహాను మనసులో పెట్టుకున్న ఆర్యవీర్, నేడు అదే క్రికెట్ మైదానంలో రికార్డులు సృష్టిస్తున్నాడు.

ఇప్పటికే నేపాల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించిన ఆర్యవీర్.. తాజాగా యూఏఈపై భారీ సెంచరీ సాధించి, తండ్రి లాగే తానూ డాషింగ్ కింగ్ అని నిరూపించుకున్నాడు. తన గొప్ప కుటుంబ నేపథ్యాన్ని పక్కనపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఆర్యవీర్ సెహ్వాగ్‌పై, గురువారం అఫ్గానిస్థాన్‌తో జరగనున్న సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *