10 తులాల నగ ఇస్తే, చేతికి 8 తులాలే! పాత నగలు మార్పిడి చేస్తే జరిగే అసలు రహస్యం.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి

మధ్యతరగతి కుటుంబాల్లో ఏదైనా శుభకార్యం వస్తుందంటే చాలు.. బీరువాలో ఉన్న పాత నగలను మార్చి, కొత్త డిజైన్లలో నగలు కొనడం తరతరాలుగా వస్తున్న ఆచారం.

అయితే, చాలా సందర్భాల్లో పాత నగలను మార్చేటప్పుడు మనకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ నష్టాన్ని నివారించడానికి కొన్ని రహస్యాలను పాటించడం ద్వారా బంగారం మరియు డబ్బును ఆదా చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం:

ఉదాహరణకు, మీరు 10 తులాల పాత నగలను ఇచ్చి కొత్తవి తీసుకున్నప్పుడు, మీ చేతికి 8 తులాల నగలే రావచ్చు. “ఏంటండీ.. 2 తులాలు తక్కువయ్యాయి?” అని అడిగితే.. మురికి, రాళ్ల బరువు, తరుగు (వేస్టేజ్) అంటూ రకరకాల లెక్కలు చెప్పి మనల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు.

బంగారు నగలలో మార్పులు

ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. పాత నగల్లో చాలా వరకు రాళ్లు (Stones) పతకం చేయబడి ఉంటాయి. ఇలా రాళ్లు ఉన్న నగలను మార్చేటప్పుడు, వాటి బరువును విడిగా తీసివేయమని చెప్పాలి. చాలా దుకాణాల్లో మొత్తం బరువులో 10% రాళ్ల బరువుగా తీసేస్తారు. కానీ నిజానికి రాళ్ల బరువు అంతకంటే తక్కువ ఉండవచ్చు. అందుకే నగలను మార్చే ముందు ఇంట్లోనే ఒకసారి బరువు చూసుకోవడం మంచిది.

పాత నగలు – శుభ్రత

అదేవిధంగా, నగలలో ఉన్న మురికిని శుభ్రం చేయకుండా బరువు చూస్తే, తేడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల నగలను శుభ్రం చేసి బరువు చూస్తారు, అప్పుడు బంగారం స్వల్పంగా కరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

తర్వాత నగలను కరిగించి నాణ్యతను పరీక్షిస్తారు. మీ నగలు 22 క్యారెట్లేనా అని ధృవీకరించడానికి కరిగిస్తామని, అలా చేసినప్పుడు 1 నుండి 2 శాతం బంగారం తగ్గుతుందని చెబుతారు. దీనికి బదులుగా, ఆధునిక పరికరమైన ‘క్యారెట్ మీటర్’ ద్వారా నగలను కరిగించకుండానే నాణ్యతను పరీక్షించమని అడగాలి.

మజూరీ (మేకింగ్ చార్జీలు), తరుగు

పాత నగలు ఇచ్చి కొత్తవి తీసుకునేటప్పుడు, ఆ దుకాణం వారు మీ పాత బంగారానికి ఆ రోజు మార్కెట్ ధరను పూర్తిగా ఇస్తున్నారా లేదా కేవలం 90% మాత్రమే ఇస్తారా అనేది ముందే అడిగి తెలుసుకోవాలి.

చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. పాత నగలను కొన్న దుకాణంలో కాకుండా వేరే చోట మార్చడం. మీరు కొన్న చోట అయితే వారికి ఆ నగ నాణ్యత తెలుస్తుంది కాబట్టి పూర్తి ధర ఇచ్చే అవకాశం ఉంటుంది. వేరే దుకాణానికి వెళ్తే నాణ్యత తక్కువని చెప్పి ధర తగ్గించడానికి ప్రయత్నిస్తారు.

బంగారం కొనేటప్పుడు జాగ్రత్త

అన్నింటికంటే ముఖ్యమైనది, నగలు కొనేటప్పుడు బేరమాడటానికి అస్సలు సంకోచించకండి. కొత్త నగలు తీసుకునేటప్పుడు వారు వేసే 12% నుండి 18% వరకు ఉండే తరుగును (Wastage) తగ్గించమని అడగండి. పాత నగలు మార్చడం వల్ల వచ్చే నష్టాన్ని ఈ తరుగు తగ్గించుకోవడం ద్వారా కొంతవరకు భర్తీ చేయవచ్చు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే బంగారం మీ చేజారిపోదని నిపుణులు సూచిస్తున్నారు.


Posted

in

by

Tags: