పశ్చిమ బెంగాల్ ఎవరి వశమవుతుంది? దీనికి సమాధానం చెప్పడం UPSC ఎగ్జామ్ పాస్ అవ్వడం అంత కష్టం. ఎందుకంటే దేశంలో రాజకీయ ఊసరవెల్లిలా ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేని ఏకైక రాష్ట్రం బెంగాల్. అందుకే రాజకీయ పండితులు కూడా ఇక్కడ అంచనాలు వేయడానికి జంకుతుంటారు.
మొదటి దశ ఎన్నికలు ముగిశాయి, రెండో దశకు (ఏప్రిల్ 29) సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ‘యాక్సిస్ మై ఇండియా’ ఛైర్మన్ ప్రదీప్ గుప్తాతో NDTV ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ కన్వల్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో బెంగాల్లో ఎవరి ప్రభుత్వం వస్తుందనే విషయంపై ప్రదీప్ గుప్తా కూడా కుండబద్దలు కొట్టినట్లు ఏమీ చెప్పలేకపోయారు. ఆ సంభాషణలోని ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి…
24 రోజులు జైలులో ఆరుగురు సర్వేయిర్లు: ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ.. బెంగాల్లో సర్వే చేస్తున్న తమ టీమ్‌కు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. “ఓటర్ల ఇష్టాఇష్టాలను అడిగి తెలుసుకుంటున్నారనే కారణంతో పోలీసులు మా ఆరుగురు సర్వేయిర్లను 24 రోజుల పాటు జైలులో పెట్టారు. దీనివల్ల ఓటర్ల జాబితా నుండి పేర్లు తొలగిపోతాయని పోలీసులు ఆరోపించారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. భారతదేశంలోని మిగతా ప్రాంతాల కంటే బెంగాల్ రాజకీయాలు ఎంత భిన్నంగా, కఠినంగా ఉంటాయో.”
‘పూర్తి నమ్మకంతో ఏమీ చెప్పలేను..’: 2013 నుండి ఇప్పటివరకు 81 ఎన్నికలలో 74 సార్లు కచ్చితమైన అంచనాలు వేసిన ప్రదీప్ గుప్తా.. బెంగాల్ విషయంలో మాత్రం వెనకడుగు వేశారు. బెంగాల్ ఓటర్ల మనసును కనిపెట్టడం ఏ విశ్లేషకుడికైనా అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎవరికి ఓటేశారంటే.. జనం మౌనం: “మేము 10 మందిని పలకరిస్తే, అందులో కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే ఎవరికి ఓటేశారో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మిగిలిన 60 శాతం మంది మౌనంగానే ఉండిపోయారు. ఈ 60 శాతం మంది ఓటర్లు ఎటువైపు ఉన్నారో అంచనా వేయడం చాలా కష్టం” అని గుప్తా తెలిపారు. సాధారణంగా దేశవ్యాప్తంగా ఇలా మౌనంగా ఉండే ఓటర్లు 10 శాతం మాత్రమే ఉంటారు, కానీ బెంగాల్లో ఈసారి ఇది 60 శాతానికి చేరుకుంది. 2016 ఎన్నికలతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువే.
భయం మరియు ‘SIR’ దెబ్బ: ఈ మౌనం వెనుక ఉన్న ప్రధాన కారణం భయం. బెంగాల్ రాజకీయాల్లో భయం దశాబ్దాలుగా ఉన్నప్పటికీ, ఈసారి ‘ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన’ (SIR) కొత్త ఆందోళనను తెచ్చింది. తమ మనసులో మాట చెబితే ఎక్కడ ఓటరు జాబితా నుండి పేరు తొలగిస్తారోనని జనం భయపడుతున్నారు.
93 శాతం ఓటింగ్ వెనుక ఉన్న లాజిక్ ఇదే: మొదటి దశలో నమోదైన భారీ ఓటింగ్ (93%) గురించి ఆయన వివరిస్తూ.. “ఓటర్ల జాబితా నుండి సుమారు 10-11 శాతం పేర్లు తొలగించబడితే, మొత్తం ఓటర్ల సంఖ్య తగ్గుతుంది. గతంలో ఓటు వేసిన వారే ఇప్పుడు కూడా ఓటు వేయడానికి వచ్చినా, బేస్ (మొత్తం సంఖ్య) తక్కువగా ఉండటం వల్ల ఓటింగ్ శాతం భారీగా కనిపిస్తుంది” అని లాజిక్‌తో వివరించారు.
