మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతంలో, సొంతూరికి వెళ్లాలనే బలమైన కోరికతో కేవలం 10 రూపాయల నోటుతో ఒక ఐదేళ్ల చిన్నారి ఒంటరిగా కల్యాణ్ రైల్వే స్టేషన్కు చేరుకున్న ఘటన స్థానికంగా తీవ్ర ఆశ్చర్యాన్ని, భావోద్వేగాన్ని కలిగించింది.
దుకాణానికి వెళ్లి స్నాక్స్ కొనుక్కుంటానని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిన ఆ చిన్నారి, ఎవరి తోడూ లేకుండా నేరుగా రైల్వే స్టేషన్కు చేరుకోవడం తీవ్ర కలకలం రేపింది.
గ్రామంలోని తమ సొంతూరికి వెళ్లి బంధువులతో ఆడుకోవాలనే ఆలోచన ఆ చిన్నారి మనసులో బలంగా నాటుకుపోయింది. ఇంటి సమీపంలోని దుకాణానికి వెళ్లి చిరుతిళ్లు తెచ్చుకుంటానని చెప్పి తల్లిదండ్రుల వద్ద రూ. 10 తీసుకున్న ఆ పాప, దారి పొడవునా దుకాణదారులను అడుగుతూ నెమ్మదిగా నడుచుకుంటూ కల్యాణ్ రైల్వే స్టేషన్కు చేరుకుంది.
అక్కడ ఒంటరిగా, భయంతో అటూ ఇటూ చూస్తూ నిలబడి ఉన్న ఆ చిన్నారిని గమనించిన రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. చిన్నారిని రక్షించి, సురక్షితంగా తమ కార్యాలయానికి తీసుకెళ్లారు.
పోలీసులు ఆ చిన్నారితో ఆప్యాయంగా మాట్లాడి వివరాలు ఆరా తీయగా, తను సొంతూరికి వెళ్లేందుకు రైలు ఎక్కేందుకే ఇక్కడికి వచ్చినట్లు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. మరోవైపు కనిపించకుండా పోయిన పాప కోసం కంగారుగా వెతుకుతున్న తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించి, స్టేషన్కు పిలిపించి చిన్నారిని క్షేమంగా వారికి అప్పగించారు.
పోలీసుల సమయస్ఫూర్తిని, త్వరితగతిన స్పందించిన తీరును తల్లిదండ్రులు కొనియాడారు. తమ చిన్నారిని గుండెలకు హత్తుకుని ఊపిరి పీల్చుకున్నారు.
