“10 రోజులుగా డాక్టర్‌ను చూడలేకపోయాను..!” కన్నీరుమున్నీరైన భారతీయ తల్లి.. న్యూజిలాండ్‌ అసలు రూపాన్ని బయటపెట్టిన వైరల్ వీడియో..!!!

విదేశాల్లో స్థిరపడితే అత్యుత్తమ వైద్య సదుపాయాలు లభిస్తాయనే భావనను మార్చేలా, న్యూజిలాండ్‌లో నివసిస్తున్న భారతీయ మహిళ ఆకృతి జైస్వాల్ శ్రీవాస్తవ పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడికి సకాలంలో వైద్యం అందించలేక ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవం ఎంతో మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆకృతి కుమారుడు కెవిన్, గత 10 రోజులుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నాడు. బాబు ఆరోగ్యం క్షీణించడంతో, ఆమె స్థానిక వైద్య కేంద్రాన్ని సంప్రదించి డాక్టర్ అపాయింట్‌మెంట్ కోరింది. అయితే, వారం రోజుల తర్వాతే అపాయింట్‌మెంట్ దొరుకుతుందని అక్కడి సిబ్బంది తెలిపారు.

దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆకృతి, ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరం లేని రాత్రి వేళ అత్యవసర క్లినిక్‌కు తన కుమారుడిని తీసుకెళ్లింది. తీరా అక్కడికి వెళ్లేసరికి, ఆసుపత్రి రోగులతో నిండిపోయిందని, కొత్త రోగులను చేర్చుకోలేమని ప్రవేశ ద్వారం వద్దే ఒక నోటీసు బోర్డు పెట్టి ఉంది.

ఆ నోటీసు బోర్డును వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్న ఆకృతి, న్యూజిలాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశంలో ఒక వైద్యుడిని కలవడమే పెద్ద పోరాటంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. అదే సమయంలో, భారతదేశంలో అయితే అదే రోజున వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స పొందే వీలుంటుందని ఆమె గుర్తుచేసుకుంది.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది. దీనిని చూసిన పలువురు ఎన్నారైలు (NRIs).. లండన్ సహా ఇతర పాశ్చాత్య దేశాలలో కూడా వైద్య రంగంలో ఇలాంటి దీనస్థితే ఉందని, డాక్టర్‌ను కలవడానికి రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని తమ అనుభవాలను పంచుకుంటున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *