ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ (Hathras) ప్రాంతంలో, చనిపోయిందని భావించి అంత్యక్రియలకు సిద్ధం చేసిన 100 ఏళ్ల వృద్ధురాలు.. అకస్మాత్తుగా ప్రాణాలతో లేచి కూర్చున్న వింత ఘటన తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది.
హత్రాస్ నగరంలోని బనియానా ప్రాంతానికి చెందిన సుఖే ఖాన్ భార్య జమీలా బేగం. 100 ఏళ్లు పైబడిన ఈమె, గత నెల రోజులుగా అనారోగ్యం కారణంగా లేచి తిరగలేక మంచానికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో, ఆదివారం ఉదయం ఆమె శ్వాస ఆగిపోవడంతో, ఆమె చనిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంటనే బంధువులకు కూడా సమాచారం అందించారు.
అనంతరం, ఆమె దేహానికి స్నానం చేయించి స్మశానవాటికకు తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియల ఏర్పాట్లను ముమ్మరంగా చేశారు. సుమారు గంటకు పైగా అంత్యక్రియల తంతు జరుగుతోంది.
ఆ సమయంలో ఎవరూ ఊహించని విధంగా, జమీలా బేగం శరీరంలో అకస్మాత్తుగా కదలికలు వచ్చి, ఆమె శ్వాస తిరిగి ఆడుతూ సాధారణ స్థితికి చేరుకున్నారు. ఇది చూసి తీవ్ర దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి గురైన బంధువులు.. వెంటనే ఆమెను లేపి మంచంపై కూర్చోబెట్టారు. అంతిమ యాత్రకు సిద్ధమైన స్థితిలో వృద్ధురాలు మళ్లీ ప్రాణాలతో తిరిగి వచ్చిన ఈ వింత ఘటన, ఆ ప్రాంతమంతా దావానలంలా వ్యాపించి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.

Leave a Reply