11 బంతుల్లో విధ్వంసం సృష్టించిన యువ ఆటగాడు; ఐపీఎల్ చరిత్రలో రెండోసారి మాత్రమే ఇలాంటి అద్భుతం!

ఐపీఎల్ 2026, 7వ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన పంజాబ్, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై, పంజాబ్ ముందు 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, పంజాబ్ బ్యాటర్లు కేవలం 18.4 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అర్ధశతకంతో రాణించగా, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 43 పరుగులు చేశారు. కానీ, కేవలం 11 బంతుల్లో 39 పరుగులు చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పిన ప్రియాంశ్ ఆర్యకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

ప్రియాంశ్ ఆర్య ‘ఇంపాక్ట్’: 210 పరుగుల ఛేదనలో పంజాబ్‌కు కావాల్సిన మెరుపు ఆరంభాన్ని ఈ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అందించాడు. ప్రియాంశ్ కేవలం 11 బంతుల్లో 3 ఫోర్లు, 4 భారీ సిక్సర్ల సాయంతో 39 పరుగులు రాబట్టాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌తో కలిసి తొలి వికెట్‌కు కేవలం 4.2 ఓవర్లలోనే 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి గెలుపు పునాది వేశాడు.

ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే: బౌలింగ్ చేయకుండా, ఫీల్డింగ్‌లో ఎవరినీ అవుట్ చేయకుండా, కేవలం 11 బంతులు మాత్రమే బ్యాటింగ్ చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్న రెండో ఆటగాడిగా ప్రియాంశ్ ఆర్య రికార్డు సృష్టించాడు. గతంలో 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్, రాజస్థాన్ రాయల్స్‌పై కేవలం 7 బంతుల్లో 25 పరుగులు చేసి ఈ అవార్డును గెలుచుకున్నాడు.

టీచర్ ఫ్యామిలీ నుండి క్రికెట్ స్టార్‌గా.. మ్యాచ్ అనంతరం ప్రియాంశ్ ఆర్య మాట్లాడుతూ.. “నాకు నా సామర్థ్యంపై నమ్మకం ఉంది. మొదటి బంతి నుండే హిట్టింగ్ చేయగలనని అనిపిస్తే వెనకాడను. మా కుటుంబంలో అందరూ టీచర్లే, మా అక్క కూడా టీచరే. క్రికెట్ వైపు రాకపోయి ఉంటే నేను కూడా టీచర్ అయ్యేవాడిని. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు” అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.


Posted

in

by

Tags: