పనిచేసే సంస్థలో తమ కష్టానికి తగిన గుర్తింపు, పండుగ సమయాల్లో చిన్న బహుమతి లభించడం ఏ ఉద్యోగికైనా ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది.
ఆ కోవలోనే, తన 11 ఏళ్ల ఉద్యోగ జీవితంలో తొలిసారిగా తన బాస్ నుంచి దీపావళి బోనస్ బహుమతిని అందుకున్న ఒక ఉద్యోగి.. ఆ ఆనందాన్ని పంచుకున్న వీడియో ఒకటి ఎక్స్ (ట్విట్టర్)లో వైరల్ అవుతూ అందరి హృదయాలను కదిలిస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఆ ఉద్యోగి తనకు లభించిన దీపావళి బోనస్ బహుమతులను ఒక్కొక్కటిగా తెరిచి చూపిస్తూ తన ఆనందాన్ని పంచుకుంటున్నాడు. ’11 ఏళ్లుగా పనిచేస్తున్న నాకు, తొలిసారిగా మా బాస్ దీపావళి బహుమతి ఇచ్చారు’ అని ఆయన ఎంతో గర్వంగా, ఉద్వేగంగా చెబుతున్నాడు.
ఆ గిఫ్ట్ బాక్స్‌లో అతనికి ఒక షర్ట్, ఒక ప్యాంట్, రూ. 1,000 నగదు ఇచ్చారు. అంతేకాకుండా, తాగడానికి ఉపయోగపడే ఒక థర్మోస్ ఫ్లాస్క్, ఒక కిలో కాజు కట్లీ స్వీట్ కూడా ఆ బహుమతిలో ఉన్నాయి. అది చిన్న బహుమతి అయినప్పటికీ, ఒక చిన్న పిల్లాడిలా ఎంతో ఆసక్తిగా, సంతోషంగా అతను దాన్ని తెరిచి చూపిస్తున్న తీరు చూసేవారి మనసును హత్తుకునేలా ఉంది.
సాధారణంగా పెద్ద కార్పొరేట్ సంస్థల్లో భారీ స్థాయిలో బోనస్‌లు ఇస్తుంటారు. కానీ, ఒక సాధారణ నేపథ్యం ఉన్న ఉద్యోగికి తన బాస్ ఎంతో ప్రేమతో ఇచ్చిన ఈ దీపావళి బహుమతి, అతని 11 ఏళ్ల నిరీక్షణకు అద్భుతమైన గుర్తింపుగా మారింది. ఈ భావోద్వేగభరితమైన వీడియోను చూసిన నెటిజన్లు చాలామంది ఆ ఉద్యోగికి తమ శుభాకాంక్షలు తెలుపుతూ వీడియోను మరింత వైరల్ చేస్తున్నారు.

Leave a Reply