అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రం లెక్సింగ్టన్ నగరంలో 25 ఏళ్ల మైఖేల్ అనే వ్యక్తి తన 11 నెలల చిన్నారి, చిన్నారి నానమ్మతో కలిసి నివసించేవాడు.
ఘటన జరిగిన రోజున ఆమె బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి చిన్నారి, మైఖేల్ ఇద్దరూ కనిపించలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గత సోమవారం రాత్రి ఒక భవనంలో ఉన్న మైఖేల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కానీ, అతని వద్ద చిన్నారి లేదు. దీంతో చిన్నారి కోసం గాలింపును మరింత తీవ్రం చేశారు. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 100 మందికి పైగా పోలీసు అధికారులు అటవీ ప్రాంతంలో వెతకడం ప్రారంభించారు.
ఆ సమయంలో ఇంటికి దాదాపు 50 గజాల దూరంలో మట్టి వదులుగా ఉండటాన్ని, దానిపై పైన్ చెట్టు ఆకులు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని అధికారులు గమనించారు. అనుమానంతో ఆ చోట తవ్వి చూడగా లోపలి నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. వెంటనే మట్టిని తొలగించి చూడగా, కుక్కలను బంధించే బోనులో చిన్నారిని పెట్టి సుమారు అడుగు లోతులో పాతిపెట్టినట్లు గుర్తించారు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసిన అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
చిన్నారి ప్రస్తుతం క్షేమంగా ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి బంధువులకు అప్పగించామని అధికారులు తెలిపారు. బోను చుట్టూ ఉన్న గుడ్డ, రాత్రిపూట వీచిన చల్లటి గాలి చిన్నారి శ్వాస తీసుకోవడానికి సహాయపడి ఉండవచ్చని వారు అభిప్రాయపడ్డారు. చిన్నారి తల్లితో మైఖేల్‌కు కొన్ని విభేదాలు ఉన్నాయని సమాచారం వచ్చినప్పటికీ, అదే ఈ దారుణానికి కారణమా అనేది ఇంకా నిర్ధారించబడలేదు. విచారణలో మైఖేల్ తన చర్య పట్ల ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని, కోర్టు అతనికి బెయిల్ కూడా నిరాకరించిందని అధికారులు తెలిపారు.

Leave a Reply