11 ఏళ్ల బాలుడికి కోర్టు సమన్లు.. బొమ్మ బైక్ నడిపితే ఇంత పెద్ద కేసా?

బొమ్మ బైక్‌ను రోడ్డుపై నడిపినందుకు కేసు.. వేలిముద్రలు తీసుకున్న పోలీసులు.. కోర్టుకు హాజరుకావాలని సమన్లు! అమెరికాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఒవీడో ప్రాంతంలో 11 ఏళ్ల కేట్ కిర్ష్నర్ అనే బాలుడు తన ఎలక్ట్రిక్ డర్ట్ బైక్‌ను రోడ్డుపై నడిపినందుకు కోర్టుకు హాజరుకావాలని సమన్లు అందుకున్నాడు.

వేసవి సెలవుల్లో చిన్నచిన్న పనులు చేస్తూ సంపాదించిన డబ్బును దాచుకున్న బాలుడు.. సుమారు 900 డాలర్లతో ఆ ఎలక్ట్రిక్ డర్ట్ బైక్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఘటన జరిగిన రోజు బాలుడు చేపలు పట్టేందుకు వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్లే వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో రోడ్డుకు ఒకవైపు బైక్ నడుపుకుంటూ వెళ్తుండగా పోలీసులు అతడిని అడ్డుకున్నారు.

రిజిస్ట్రేషన్ లేని వాహనం నడపడం, బీమా లేకపోవడం, అవసరమైన భద్రతా పరికరాలు ధరించకపోవడం వంటి కారణాలను పోలీసులు చూపించినట్లు సమాచారం. అనంతరం బాలుడి బైక్‌ను స్వాధీనం చేసుకుని, టోయింగ్ వాహనంలో తరలించారు.

అంతేకాకుండా.. 11 ఏళ్ల బాలుడని కూడా చూడకుండా పోలీసులు అతడి వేలిముద్రలను నమోదు చేసినట్లు తండ్రి ఆరోపించారు. కోర్టుకు హాజరుకాకపోతే వారెంట్ జారీ అయ్యే అవకాశం ఉందని కూడా పోలీసులు హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.

పోలీసులు తన కుమారుడితో ఓ పెద్ద వ్యక్తితో వ్యవహరించినట్టుగా కఠినంగా ప్రవర్తించారని బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

బాలుడు నిబంధనలు ఉల్లంఘించి ఉండవచ్చని అంగీకరించినప్పటికీ.. ఈ విషయంలో పోలీసులు తమ అధికారాన్ని అవసరానికి మించి ఉపయోగించారని ఆయన ఆరోపించారు.

ఈ కేసును వెంటనే కొట్టివేయాలని కోరుతూ సంబంధిత అధికారులను, ప్రధాన న్యాయవాదిని సంప్రదించనున్నట్లు బాలుడి తండ్రి వెల్లడించారు.

11 ఏళ్ల బాలుడు ఎలక్ట్రిక్ డర్ట్ బైక్ నడపడం నిబంధనలకు విరుద్ధమా? లేక పోలీసులు అతనిపై అతిగా కఠినంగా వ్యవహరించారా? అనే చర్చ ప్రస్తుతం స్థానికంగా జరుగుతోంది.


Posted

in

by

Tags: