శ్రేయస్ అయ్యర్ సారధ్యంలోని పంజాబ్ కింగ్స్ (PBKS), ఐపీఎల్ 2026లోని 7వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ సీజన్లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవడంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
చెన్నైలోని చెపాక్ మైదానంలో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై, పంజాబ్ ముందు 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే పంజాబ్ కింగ్స్ కేవలం 18.4 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీతో రాణించగా, ప్రభ్సిమ్రాన్ సింగ్ 43 పరుగులు చేశాడు. కానీ, కేవలం 11 బంతుల్లో 39 పరుగులు చేసిన ప్రయాన్ష్ ఆర్యను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది.
ప్రయాన్ష్ ఆర్య ఇంపాక్ట్: 210 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు కావలసిన మెరుపు ఆరంభాన్ని ఈ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అందించాడు. ప్రయాన్ష్ తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 భారీ సిక్సర్ల సాయంతో 354కు పైగా స్ట్రైక్ రేట్‌తో చెలరేగిపోయాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్‌తో కలిసి తొలి వికెట్‌కు 4.2 ఓవర్లలోనే 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పంజాబ్ విజయాన్నే పునాది వేశాడు.
ఐపీఎల్ చరిత్రలో రెండోసారి: బౌలింగ్ చేయకుండా, ఫీల్డింగ్‌లో ఎవరినీ అవుట్ చేయకుండా.. కేవలం బ్యాటింగ్‌లో 11 బంతులు మాత్రమే ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్న రెండో ఆటగాడిగా ప్రయాన్ష్ ఆర్య రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్, రాజస్థాన్ రాయల్స్‌పై 7 బంతుల్లో 25 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు.
ప్రయాన్ష్ ఆర్య ఏమన్నాడంటే? “చిన్నప్పటి నుండి నా ఆట తీరు ఇలాగే ఉంది. జట్టుకు అవసరమైనప్పుడు రిస్క్ తీసుకోవడానికి నేను వెనుకాడను. ఐపీఎల్లో బౌలర్లు అనుభవజ్ఞులు అయినప్పటికీ, నా సామర్థ్యంపై నాకు నమ్మకం ఉంది. మా ఇంట్లో అందరూ టీచర్లు, నా సోదరి కూడా టీచరే. క్రికెట్ ఆడకపోయి ఉంటే నేను కూడా టీచర్నే అయ్యేవాడిని. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు (నవ్వుతూ..)” అని ప్రయాన్ష్ తెలిపాడు.
