మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ ప్రాంతంలో 10 ఏళ్ల బాలుడిపై జరిగిన అమానుష దాడి తీవ్ర కలకలం రేపింది.
బడి ముగిసి ఇంటికి తిరిగి వస్తున్న బాలుడిని గుర్తుతెలియని ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి నమ్మించి తీసుకెళ్లి, అడవిలోని ఓ చెట్టుకు కట్టేసి 12 గంటల పాటు చిత్రహింసలకు గురిచేసిన దారుణం వెలుగులోకి వచ్చింది.
బాధిత బాలుడు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 16న ఉదయం సుమారు 7:30 గంటల ప్రాంతంలో బడికి వెళ్లిన బాలుడు, సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో, బడి ముగిసిన తర్వాత వస్తున్న బాలుడిని ఒక గుర్తుతెలియని వ్యక్తి వాహనంలో ఎక్కించుకుని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు.
అక్కడ ఆ బాలుడిని చెట్టుకు కట్టేసి, 12 గంటలకు పైగా మూడుసార్లు విచక్షణారహితంగా దాడి చేశాడు. అర్ధరాత్రి ఆ వ్యక్తి మద్యం మత్తులో నిద్రపోవడాన్ని గమనించిన బాలుడు, ఎంతో కష్టపడి తాళ్లను విప్పుకుని అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ప్రాణభయంతో పరుగులు తీసిన ఆ బాలుడు, శ్రీరామ్ కాలనీలో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి చేరుకుని జరిగిన ఘోరాన్ని కన్నీరుమున్నీరవుతూ వివరించాడు.
అనంతరం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలుడు చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు, అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాలుడికి ఎదురైన ఈ దారుణ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని, తీవ్ర విచారాన్ని నింపింది.

Leave a Reply