మహారాష్ట్రలోని ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో, స్పైస్‌జెట్ సంస్థకు చెందిన విమానాలు 12 గంటలకు పైగా నిలిచిపోవడంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మంగళవారం రాత్రి 7 గంటల నుంచి ముంబై నుంచి ఒక్క స్పైస్‌జెట్ విమానం కూడా బయలుదేరలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రాత్రి 11:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం కూడా కదలకపోవడంతో, తమ విమానాలు ఆలస్యమయ్యాయా లేదా రద్దు అయ్యాయా అనే స్పష్టత లేక ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సరైన సమాచారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి విమానయాన సంస్థ సిబ్బంది ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో, ఆగ్రహించిన ప్రయాణికులు స్పైస్‌జెట్ కౌంటర్లను ముట్టడించి నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 12 గంటల విమానం కోసం వసాయ్ ప్రాంతం నుంచి బంధువులతో వచ్చిన ఓ ప్రయాణికుడు, విమానయాన సంస్థ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని, కనీస సమాచారం తెలుసుకునేందుకు కూడా ప్రయాణికులు పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై స్పైస్‌జెట్ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.
గత కొద్ది రోజులుగా స్పైస్‌జెట్ సంస్థ తీవ్రమైన నిర్వహణ, కార్యాచరణ సంక్షోభాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా, నవంబర్ 12న దుబాయ్ విమానాశ్రయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థకు చెల్లించాల్సిన 14 మిలియన్ల యూఏఈ దిర్హామ్‌ల (సుమారు రూ. 30 కోట్లకు పైగా) బకాయిలు చెల్లించకపోవడంతో, ప్రయాణికుల చెక్-ఇన్ సేవలు నిలిచిపోయి 4 విమానాలు రద్దయ్యాయి.
ఈ వరుస సమస్యల కారణంగా, ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై విమానాశ్రయ అధికారులు గత వారాంతంలోనే ప్రయాణికులకు ముందస్తు ప్రకటనలు జారీ చేశారు. స్పైస్‌జెట్ విమానాల కార్యాచరణలో అంతరాయాల కారణంగా ప్రయాణ ప్రణాళికల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందే తమ విమాన స్టేటస్‌ను సరిచూసుకోవాలని సూచించిన నేపథ్యంలో, తాజాగా ముంబైలో చోటుచేసుకున్న ఈ ఆకస్మిక అంతరాయం తీవ్ర కలకలం రేపుతోంది.

Leave a Reply