సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక హృదయవిదారక వీడియో, అందరినీ ఆలోచింపజేయడంతో పాటు కంటతడి పెట్టిస్తోంది.
కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ మరియు దుకాణాల వెలుపల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే సెక్యూరిటీ గార్డుల కష్టతరమైన జీవనశైలిని వెలుగులోకి తెచ్చిన ఈ ఘటన, శ్రమజీవులకు పని వేళల్లో కనీసం కాసేపు కూర్చునే హక్కు కూడా లేదా అనే పెద్ద ప్రశ్నను లేవనెత్తింది.
వైరల్ అయిన ఆ వీడియోలో, ఒక మహిళ సెక్యూరిటీ గార్డు వద్దకు వెళ్లి, ‘మీకు ఎన్ని గంటల డ్యూటీ?’ అని అడుగుతుంది. దానికి ఆ వ్యక్తి సాధారణంగా ’12 గంటలు’ అని బదులిస్తాడు. ఆ తర్వాత, ‘మీరు 12 గంటల పాటు నిలబడే పనిచేస్తారా?’ అని ఆ మహిళ ఆశ్చర్యంగా అడగ్గా, దానికి అతను అవునని సమాధానం ఇస్తాడు.
ఆ తర్వాత ఆ మహిళ కాపలాదారుడి కాళ్లను నిశితంగా గమనించగా, ఏకధాటిగా నిలబడటం వల్ల అతని కాళ్లు బాగా వాచిపోవడం చూసి చలించిపోతుంది. అప్పుడు, ‘పని వేళల్లో మీకు కూర్చోవడానికి ఒక కుర్చీ కావాలా?’ అని ఆమె అడగ్గా, దానికి ఆ వ్యక్తి ‘విరామ సమయంలో కాసేపు కూర్చోవడానికి అవకాశం దొరికితే, కాలి నొప్పి, వాపు నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది’ అని మృదువుగా బదులిచ్చాడు.
ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు, భద్రతా విధుల్లో ఉండే సామాన్య ఉద్యోగుల పట్ల ఇలాంటి అమానవీయ పద్ధతులను ఎందుకు అవలంబిస్తున్నారని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంతేకాకుండా, ఎక్కువ సేపు నిలబడి పనిచేసే ఇలాంటి ఉద్యోగాల్లో ఉన్నవారికి సరైన సీటింగ్ (కూర్చునే) సదుపాయం కల్పించడాన్ని కార్మిక చట్టాలు తప్పనిసరి చేయాలని పలువురు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply