సొంత తండ్రి చేతిలోనే ఏళ్ల తరబడి తీవ్ర లైంగిక వేధింపులకు గురైన బాలికల ఉదంతం రష్యాలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఈ దారుణ ఘటనలో భర్తకు సహకరించినందుకు గాను, పిల్లల తల్లి అయిన 35 ఏళ్ల టట్యానా క్రాసికోవ్కు న్యాయస్థానం ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. కుటుంబ పోషణ అంతా తండ్రే చూసుకుంటున్నందున అతడు చెప్పినట్లే నడుచుకోవాలని ఒత్తిడి చేస్తూ, తల్లి స్వయంగా తన కూతుళ్లను ఈ దారుణానికి నెట్టినట్లు కోర్టు విచారణలో రుజువైంది.
కేసు పూర్వాపరాల ప్రకారం.. 36 ఏళ్ల తండ్రి రోమన్ క్రాసికోవ్, తన మైనర్ కూతుళ్లకు 9 లేదా 10 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఈ లైంగిక దాష్టీకానికి పాల్పడ్డాడు. దాదాపు దశాబ్ద కాలం పాటు (సుమారు తొమ్మిదేళ్లు) ఈ అమానవీయ లైంగిక వేధింపులు కొనసాగాయి. ఈ ఘోరం గురించి పిల్లలు తల్లికి మొరపెట్టుకున్నప్పటికీ, “నాన్న ఏం అడిగినా కాదనకుండా చేయండి” అని టట్యానా చెప్పినట్లు బాధితులు వాంగ్మూలం ఇవ్వడం ఈ ఘటన తీవ్రతను తెలియజేస్తోంది.
చాలా కాలం పాటు గుట్టుగా సాగిన ఈ దారుణం.. పెద్ద కుమార్తె కళాశాలలో చేరిన తర్వాత వెలుగులోకి వచ్చింది. తాను, తన చెల్లెళ్లు ఎదుర్కొన్న నరకం గురించి ఆమె తన ప్రియుడికి వివరించింది. అనంతరం వారు పోలీసులకు సమాచారం అందించడంతో అధికారులు సత్వర విచారణ జరిపి తండ్రి రోమన్ను అరెస్టు చేశారు. విచారణలో అతడు తన నేరాలను అంగీకరించాడు.
యుక్తవయసులోనే వివాహం చేసుకున్న ఈ దంపతులకు మొత్తం 12 మంది సంతానం. కాగా, 2019లో జరిగిన అగ్నిప్రమాదంలో వీరిలో నలుగురు పిల్లలు మరణించారు. బయటి ప్రపంచానికి పిల్లలంతా ఎంతో ఆరోగ్యంగా ఉంటూ, రోజూ పాఠశాలకు వెళ్తూ సాధారణ జీవితం గడుపుతున్నట్లే కనిపించినప్పటికీ.. ఆ నాలుగు గోడల మధ్య తల్లికి తెలిసే ఈ దారుణాలు సాగాయని కోర్టు తీర్పుతో స్పష్టమైంది.
