ముజఫర్‌పూర్: పదమూడేళ్ల క్రితం అదృశ్యమైన ఒక మైనర్ బాలిక ఆచూకీ ఎట్టకేలకు లభించింది. అయితే ఇప్పుడు ఆమె నలుగురు పిల్లల తల్లి. ఆమె అదృశ్యం వెనుక ఉన్న అసలు కారణం తెలిసి ఆమె కుటుంబ సభ్యులు విస్తుపోయారు. అసలు విషయం ఏమిటంటే.. 2013లో ఆ బాలిక తన అక్కతో కలిసి పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తూ దారిలో అదృశ్యమైందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒక వ్యక్తి ఆమెను మభ్యపెట్టి తీసుకెళ్లాడని అప్పట్లో కుటుంబ సభ్యులు ఆరోపించారు. కానీ పోలీసులు అప్పట్లో ఆమె ఆచూకీ కనుగొనలేకపోయారు. ఇప్పుడు ఆమె దొరికిన తర్వాత తెలిసిన నిజం విని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ ఘటన ముజఫర్‌పూర్ జిల్లా కత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్‌గావ్ గ్రామంలో జరిగింది. 2013 మే 11న తన మైనర్ కుమార్తె గుల్నాజ్ ఖాతూన్ స్కూలుకు వెళ్లి తిరిగి రాలేదని ఆమె తల్లి హర్సిదా ఖాతూన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరసకు సోదరుడయ్యే వ్యక్తితో పరారీ
గుల్నాజ్ తన గ్రామంలోనే నివసిస్తున్న రాకేశ్ ఠాకూర్ అనే వ్యక్తి తన కుమార్తెను అపహరించాడని ఆమె తల్లి అప్పట్లో ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏళ్ల తరబడి విచారణ జరిపినా ఫలితం లేకపోయింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత పోలీసులు ఆమెను కనుగొన్నప్పుడు షాకింగ్ నిజం బయటపడింది. ఆ యువతి తన పొరుగునే ఉండే తన మేనత్త/చిన్నమ్మ కుమారుడు (వరసకు సోదరుడు) అబ్దుల్‌తో కలిసి ఇంటి నుండి పారిపోయిందని, ప్రస్తుతం ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నారని విచారణలో తేలింది.
భర్త వద్దకు పంపిన కోర్టు
సమాచారం ప్రకారం.. ఇంటి నుండి పారిపోకముందే గుల్నాజ్, అబ్దుల్ మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఇద్దరూ కలిసి పారిపోవాలని పథకం వేసి అప్పటి నుండి కలిసే ఉంటున్నారు. 2013 నుండి ఎంతోమంది పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసినా ఫలితం దక్కలేదు. చివరకు కత్రా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ రాణి కుమారి 13 ఏళ్ల తర్వాత అదే ప్రాంతంలోని దర్గా చౌక్ వద్ద ఆమెను గుర్తించారు. అనంతరం యువతిని కోర్టులో హాజరుపరిచి సెక్షన్ 164 కింద స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా, కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆమెను తన భర్త వద్దకు పంపించారు.
