రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నేత రాఘవ్ చద్దా ప్రఖ్యాత వీడియో గేమ్ జీటీఏ 6 (GTA 6) విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
ఆ వీడియోలో, టీవీ ముందు గేమింగ్ కన్సోల్‌తో కూర్చున్న ఆయన అర్ధరాత్రి 12 గంటల కోసం వేచి చూస్తున్నారు. గేమ్ విడుదల సమయం రాగానే కెమెరా వైపు చూస్తూ చిరునవ్వు నవ్విన ఆయన ఉత్సాహం అభిమానులను ఆకట్టుకుంది. దీనికి తోడు, “పార్లమెంటు బయట నా జీవితంలో ఒక చిన్న భాగం ఇది” అని పేర్కొంటూ, అర్ధరాత్రి 11.59 గంటలు కూడా చాలా సుదీర్ఘ సమయంగా అనిపిస్తోందని పోస్ట్ చేశారు.
రాఘవ్ చద్దా షేర్ చేసిన ఈ వీడియో బయటకు రాగానే సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన గేమింగ్ ఆసక్తిని ప్రశంసించగా, మరికొందరు రాజకీయ విధులను, గేమ్ ఆడే ఆసక్తిని పోలుస్తూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
ఉదయం పార్లమెంటు సమావేశాలు ఉన్నా, అర్ధరాత్రి గేమ్ ఆడేందుకు సమయం దొరికిందంటూ ఒకరు చమత్కరించారు. అలాగే, ఉచితంగా ప్లేస్టేషన్ 5 (PlayStation 5) అందించే పథకాన్ని తీసుకురావాలని కొందరు సరదాగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆయన పోస్ట్ ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారింది.
రాఘవ్ చద్దా పంచుకున్న ఈ వీడియోకు కారణమైన జీటీఏ 6 గేమ్, రాక్‌స్టార్ గేమ్స్ సంస్థ నుంచి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న విడుదల. 2013లో వచ్చిన జీటీఏ 5 తర్వాత ఈ సిరీస్‌లో తదుపరి ప్రధాన భాగం కోసం అభిమానులు సుదీర్ఘ కాలంగా వేచి ఉన్నారు. ఫ్లోరిడాను తలపించేలా రూపొందించిన కల్పిత ప్రాంతం ‘లియోనిడా’లోని వైస్ సిటీ నేపథ్యంలో ఈ గేమ్ కథ సాగుతుంది.
లూసియా కామినోస్, జాసన్ డువాల్ అనే ఇద్దరు ప్రధాన పాత్రల చుట్టూ ఈ గేమ్‌ను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ ప్రియుల్లో భారీ అంచనాలను నెలకొల్పిన ఈ గేమ్‌పై రాఘవ్ చద్దా కూడా తన ఆసక్తిని వ్యక్తం చేయడం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Leave a Reply