జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రతిపక్ష నేత బాబూలాల్ మరాండీ తన భద్రత కోసం ప్రభుత్వం కేటాయించిన 13 ఏళ్ల పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వానికే తిరిగి ఇచ్చేశారు.
ప్రయాణ సమయంలో ఆ వాహనం తరచుగా పాడైపోతూ నడిరోడ్డుపై ఆగిపోతోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ విషయంపై ఆయన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఓ లేఖ రాశారు. తన వాహనం అధ్వాన స్థితిలో ఉందని గత మార్చి 21నే ప్రభుత్వానికి తెలిపినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో వేరే దారి లేక భద్రత కోసం ఇచ్చిన వాహనాన్ని వెనక్కి అప్పగిస్తున్నట్లు తెలిపారు.
కేవలం తన వాహన పరిస్థితే కాకుండా, భద్రతా విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది వినియోగిస్తున్న జీపులు కూడా అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయని బాబూలాల్ మరాండీ తెలిపారు. ఆ జీపులు ఇప్పటికే 4 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగాయని, దీనిపై డీజీపీ సహా ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మాజీ సీఎం అర్జున్ ముండా కాన్వాయ్‌లోని భద్రతా వాహనం కూడా నవంబర్ 6న ప్రమాదానికి గురైన విషయాన్ని ఆయన తన లేఖలో గుర్తుచేశారు.
రాష్ట్రంలోని మాజీ ముఖ్యమంత్రులందరికీ కేటాయించిన భద్రతా వాహనాలన్నింటినీ ఒకే ప్రమాణాలతో తనిఖీ చేసి, తక్షణమే సురక్షితమైన కొత్త వాహనాలను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా, గతంలో తాను చేసిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల గురించి 7 రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు.

Leave a Reply