హర్యానా రాష్ట్రం సోనిపట్ జిల్లాలోని భైన్స్వాల్ గ్రామానికి చెందిన మాజీ ప్రో కబడ్డీ ఆటగాడు అంకిత్, మోహనా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న సోనిపట్ ప్రభుత్వ రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సోనిపట్ సివిల్ ఆసుపత్రికి తరలించారు.
శిక్షణ అకాడమీ నిర్వహిస్తున్న అంకిత్‌పై 13 ఏళ్ల బాలిక పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు నమోదైంది. శిక్షణ కోసం వచ్చిన బాలిక పట్ల అంకిత్ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు రాగా, భయపడిపోయిన ఆ బాలిక ఇంట్లో విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదు ఆధారంగా గోహానా సదర్ పోలీసులు అంకిత్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోక్సో కేసు నమోదైనప్పటి నుండి అంకిత్ తీవ్ర మనస్తాపంతో ఉన్నాడని, అందువల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
బాధిత బాలికకు గోహానా సివిల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, తదుపరి పరీక్షల కోసం కాన్పూర్‌లోని భగత్ ఫూల్ సింగ్ మహిళా వైద్య కళాశాలకు తరలించారు.
ఇప్పటికే రెండుసార్లు ప్రో కబడ్డీ లీగ్‌లో ఆడిన అంకిత్, మూడోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తమకు తెలియదని అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply