జాల్నా (మహారాష్ట్ర): ప్రేమకు సరిహద్దులు లేవంటారు.. కానీ ఈ ఐఏఎస్ జంట విషయంలో ‘ప్రేమకు కిలోమీటర్ల దూరం కూడా అడ్డంకి కాదని’ నిరూపితమైంది. వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు క్యాడర్లు.. మధ్యలో 1300 కిలోమీటర్ల దూరం! కానీ, వారి మధ్య ఉన్న బలమైన బంధం ఇప్పుడు వారిని ఒకే జిల్లాకు, ఒకే ఆఫీసు పరిధిలోకి తీసుకువచ్చింది. మహారాష్ట్రలోని జాల్నా జిల్లా అభివృద్ధి పగ్గాలను ఇప్పుడు ఈ ఐఏఎస్ దంపతులు తమ చేతుల్లోకి తీసుకున్నారు.
ఒకే జిల్లా.. భార్య మున్సిపల్ కమిషనర్, భర్త సీఈవో!
ఏప్రిల్ 2, 2026న మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 2022 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు అంజలి శర్మ, ఆమె భర్త కృష్ణకాంత్ కన్వారియాలకు జాల్నా జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చారు.
- అంజలి శర్మ: జాల్నా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు (నగర అభివృద్ధి).
- కృష్ణకాంత్ కన్వారియా: జాల్నా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO)గా నియమితులయ్యారు (గ్రామీణ అభివృద్ధి). దీంతో భార్య నగరాన్ని, భర్త పల్లెలను అభివృద్ధి చేసే అరుదైన బాధ్యతను ఈ జంటకు ప్రభుత్వం అప్పగించింది.
ముస్సోరీలో మొదలైన బంధం
ఈ ఇద్దరూ 2021 యూపీఎస్సీ బ్యాచ్‌కి చెందినవారే. కృష్ణకాంత్ తన నాలుగో ప్రయత్నంలో 382వ ర్యాంకు సాధించగా, అంజలి మొదటి ప్రయత్నంలోనే 450వ ర్యాంకుతో మెరిశారు. ముస్సోరీలోని ఎల్.బి.ఎస్.ఎన్.ఏ.ఏ (LBSNAA) శిక్షణ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే, శిక్షణ తర్వాత కృష్ణకాంత్‌కు జార్ఖండ్ క్యాడర్, అంజలికి మహారాష్ట్ర క్యాడర్ కేటాయించారు.
ప్రేమ కోసం క్యాడర్ మార్పు
జార్ఖండ్ నుంచి మహారాష్ట్రకు మధ్య సుమారు 1300 కిలోమీటర్ల దూరం ఉంది. పెళ్లయిన తర్వాత కూడా దూరంగా ఉండటం ఇబ్బందిగా మారడంతో, కృష్ణకాంత్ తన జార్ఖండ్ క్యాడర్‌ను వదులుకుని, జనవరి 2026లో ‘స్పౌస్ గ్రౌండ్’ (జీవిత భాగస్వామి ప్రాతిపదికన) మీద మహారాష్ట్ర క్యాడర్‌కు మారారు. ఇప్పుడు ప్రభుత్వం వారిద్దరినీ ఒకే జిల్లాకు కేటాయించడంతో ఈ ఐఏఎస్ జంట హర్షం వ్యక్తం చేస్తోంది.
రాజస్థాన్ టు బీహార్.. వయా మహారాష్ట్ర!
ఐఏఎస్ కృష్ణకాంత్ కన్వారియా రాజస్థాన్ రాష్ట్రంలోని నాగోర్ జిల్లాకు చెందినవారు కాగా, అంజలి శర్మ బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందినవారు. అంజలి యూపీఎస్సీ కంటే ముందే బీపీఎస్సీ (BPSC) పాసై ఆర్డీఓ (RDO)గా కూడా పనిచేశారు. రెండు వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వీరు, ఇప్పుడు మహారాష్ట్రలో ఒకే జిల్లా అభివృద్ధికి సంయుక్తంగా కృషి చేయబోతున్నారు.
వీరిద్దరి సక్సెస్ స్టోరీ మరియు లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో యువతకు మరియు యూపీఎస్సీ అభ్యర్థులకు పెద్ద ఇన్స్పిరేషన్గా మారింది.
