ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నేరం రుజువు కావడంతో, నిందితుడైన 16 ఏళ్ల బాలుడికి న్యాయస్థానం 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.
గత 2024 ఆగస్టు 21న చిత్బడాగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసు విచారణ ముగియడంతో న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విమల్ కుమార్ రావత్ మాట్లాడుతూ.. శిక్ష పడిన బాలుడికి ప్రస్తుతం 16 ఏళ్లు మాత్రమే ఉన్నందున, 21 ఏళ్లు వచ్చే వరకు అతడిని ఘాజీపూర్లోని బాలల సంరక్షణ/పరిశీలన గృహంలో (Juvenile Home) ఉంచుతారని తెలిపారు.
అతడికి 21 ఏళ్లు నిండిన తర్వాత, మిగిలిన శిక్షా కాలాన్ని అనుభవించేందుకు సాధారణ కారాగారానికి (జైలుకు) తరలిస్తారని వివరించారు. చిన్నారులపై లైంగిక దాడుల నివారణ చట్టం (పోక్సో) కింద విచారణను వేగవంతంగా పూర్తి చేసి ఈ చరిత్రాత్మక తీర్పును వెలువరించారు.
