ఇంటి నుండి పనిచేసే ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సంస్కృతి ప్రస్తుతం మన రోజువారీ జీవితంలో ఒక భాగమైపోయింది.
ఆన్లైన్ మీటింగ్‌లు అత్యంత సాధారణంగా జరుగుతున్న వేళ, ఊహించకుండా జరిగే కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఇంటర్నెట్లో విపరీతంగా వ్యాపించి వైరల్ అవుతున్నాయి. ఆ క్రమంలో, ఒక లైవ్ మీటింగ్‌లో మహిళా ఉద్యోగి ఒకరు ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుని పాల్గొనడం, దానికి ఆమె ఇచ్చిన సరదా సమాధానం ప్రస్తుతం ఇంటర్నెట్లో తీవ్ర చర్చకు దారితీసింది.
అది సాధారణంగా జరిగే ఆఫీస్ ఆన్లైన్ మీటీంగ్. మేనేజర్ తన టీమ్‌తో కలిసి ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి చర్చిస్తున్నారు. ఆ సమయంలో, మీటింగ్‌లో పాల్గొన్న ఒక మహిళా ఉద్యోగిని తన కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ నిరంతరం కోరారు. “దయచేసి మీ కెమెరాను ఆన్ చేయండి, అప్పుడే నేను ప్లాన్లను మీతో పంచుకోగలను” అని ఆయన పదేపదే చెప్పారు.
ప్రారంభంలో సంకోచించిన ఆ మహిళా ఉద్యోగి, మేనేజర్ ఒత్తిడి తెచ్చేవరకూ వేరే దారి లేక తన కెమెరాను ఆన్ చేయాల్సి వచ్చింది. కెమెరా ఆన్ అవ్వగానే, స్క్రీన్‌పై కనిపించిన దృశ్యాన్ని చూసి మేనేజర్ ఒక నిమిషం షాక్ అయ్యి ఉండిపోయారు. అవును, ఆ ఉద్యోగి తన ముఖమంతా తెల్లటి రంగులో ఉన్న ఫేస్ ప్యాక్ వేసుకుని కూర్చుంది.
ఇది చూసి కోపం ఆపుకోలేని మేనేజర్, వెంటనే అభ్యంతరం వ్యక్తం చేస్తూ, “ఇలాంటి పనులన్నీ మీ లంచ్ టైమ్‌లోనే చేసుకోవచ్చు కదా” అన్నారు. కానీ, ఇప్పటి Gen Z తరానికి చెందిన ఆ మహిళా ఉద్యోగి కొంచెం కూడా భయపడకుండా, చాలా కూల్‌గా ఒక సమాధానం ఇచ్చింది. “మీరు ఇచ్చే లంచ్ బ్రేకే కేవలం 15 నిమిషాలు మాత్రమే కదా; కానీ, నేను వేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ ఆరడానికి సరిగ్గా 20 నిమిషాలు పడుతుంది కదా!” అని బదులిచ్చింది. అంతటితో ఆగకుండా, చాలా అమాయకంగా, “ఇప్పుడు నేను నా కెమెరాను ఆఫ్ చేసుకోవచ్చా సర్?” అని అడిగి అందరినీ ఆశ్చర్యపరిచింది.
X ప్లాట్‌ఫారమ్‌లో పంచుకోబడిన ఈ ఆసక్తికరమైన వీడియో క్లిప్, ప్రస్తుతం లక్షలాది వీక్షణలను దాటి ఇంటర్నెట్లో విపరీతంగా వ్యాపిస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు. ఒక వర్గం వారు ఉద్యోగికి మద్దతుగా, “రిమోట్ విధానంలో పనిచేసే ఉద్యోగులు ఫేస్ మాస్క్ వేసుకుంటే ఏంటి, పని సరిగ్గా జరిగితే అది చాలు. మేనేజర్లకు ఎప్పుడూ కెమెరా చూడాలనే వ్యామోహం ఎందుకు?” అని ప్రశ్నిస్తున్నారు. మరొక వర్గం వారు ఆఫీస్ మీటింగ్‌లలో పాటించాల్సిన ప్రాథమిక క్రమశిక్షణ గురించి, అలాగే ఇటువంటి వీడియోలు కేవలం వ్యూస్ కోసం ప్లాన్ చేసి చిత్రీకరించారా అని చర్చిస్తుండటం గమనార్హం.

Leave a Reply