“15 ఏళ్లుగా 763 సార్లు సముద్రంలో మునిగి వెతుకుతున్న భర్త..!” ఆమె అట్టడుగు సముద్రంలో ఎక్కడో దగ్గర్లోనే ఉంది.. సునామీలో కొట్టుకుపోయిన భార్య.. ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తున్న నిజమైన ప్రేమకథ..!!

గత 2011వ సంవత్సరం మార్చి 11న జపాన్‌లో సంభవించిన వినాశకరమైన సునామీ అలల దాటికి లక్షలాది మంది ప్రజలు తమ ఆస్తులను, బంధువులను కోల్పోయారు.

అందులో తన భార్యను కూడా కోల్పోయిన యాసువో తకమట్సు అనే 60 ఏళ్లు పైబడిన వృద్ధుడు, సునామీ విపత్తు జరిగి 15 ఏళ్లు గడిచినా తన భార్య కోసం సముద్రంలో మునిగి వెతుకుతున్న ఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల హృదయాలను కలచివేస్తోంది.

జపాన్‌లోని మియాగీ ప్రిఫెక్చర్‌లోని ఒనగావా ప్రాంతంలో నివసిస్తున్న ఈయన, తన భార్య యుకో సునామీలో కొట్టుకుపోయిన రోజు నుండి నేటికీ ఆశను వదులుకోలేదు. నెలకు రెండుసార్లు బరువైన డైవింగ్ దుస్తులు ధరించి, లోతైన సముద్రంలోకి వెళ్లి వెతకడం అలవాటుగా చేసుకున్నాడు. గత 15 ఏళ్లలో తన భార్య కోసం ఆయన సుమారు 763 సార్లు సముద్రంలోకి డైవ్ చేశాడు.

సముద్రంలో వెతకడం ప్రారంభించిన తొలినాళ్లలో తన భార్య మృతదేహాన్ని లేదా ఆమె ఆనవాళ్లనైనా కనిపెట్టాలనే ఉద్దేశం ఉండేది. కానీ ఏళ్లు గడుస్తున్న కొద్దీ, ఇప్పుడు సముద్రంలోకి వెళ్లి వెతకడం అనేది ఆయనకు ఒక బాధ్యత అనేదాని కంటే మించిపోయి, తన భార్యతో మాట్లాడుతున్నట్లుగా, ఆమె తన పక్కనే ఉన్నట్లుగా భావిస్తున్నానని ఆయన చెబుతున్నాడు. సముద్రం అడుగున ఉండే ప్రశాంత వాతావరణం, భార్య జ్ఞాపకాలతో అతడిని అనుసంధానించే పవిత్ర స్థలంగా మారిపోయింది.

జపాన్ ప్రభుత్వ అధికారిక సమాచారం ప్రకారం, 2011 సునామీ విపత్తులో సుమారు 19,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే 2,500 మందికి పైగా గల్లంతైనట్లు ప్రకటించబడగా, వారి మృతదేహాలు ఇప్పటివరకు దొరకలేదు. గల్లంతైన అనేక కుటుంబాలకు మరణపు విషాదం మానని గాయంగా మిగిలిపోగా, తకమట్సు మాత్రం తన భార్య జ్ఞాపకాలను సముద్రం అడుగున వెతుక్కుంటూ తన మనసుకు ప్రశాంతతను పొందుతున్నాడు.

సముద్రం అడుగున భవనాల శిథిలాలు, వంతెనల భాగాలు చేపలకు ఆవాసంగా మారినప్పటికీ, ఈయన మనసులో మాత్రం భార్య జ్ఞాపకాలు చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి. బహుశా తన భార్య మృతదేహం దొరకదని ఆయనకు తెలిసి ఉండవచ్చు, కానీ ప్రతిసారీ సముద్రంలోకి దిగినప్పుడు ఆయన తన ప్రేమను, జ్ఞాపకాలను సముద్రానికి అంకితమిస్తూ ఆ ఆలోచనల్లోనే తన భార్యతో జీవిస్తున్నాడు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *