మధ్యప్రదేశ్‌లోని మైహర్ (Maihar) అటవీ ప్రాంతంలో గత 22 రోజులుగా అటవీశాఖకు, ప్రజలకు సవాలుగా మారిన ‘E-5’ అనే మగ అడవి ఏనుగు, చివరకు బాణ్‌సాగర్ డ్యామ్ (Bansagar Dam) నీటిలో సుమారు 5 కిలోమీటర్లు ఈదుకుంటూ వెళ్లి షాదోల్ జిల్లాలోని బియోహరి (Beohari) అటవీ ప్రాంతానికి చేరుకుంది.
దీంతో గత కొన్ని వారాలుగా రామ్‌నగర్, అమర్‌పటన్ ప్రాంతాల్లో నెలకొన్న భయాందోళనలు తగ్గుముఖం పట్టాయి.
సెప్టెంబర్ ప్రారంభంలో ఈ ఏనుగు బాణ్‌సాగర్ డ్యామ్‌ను దాటి మైహర్ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు సమాచారం. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో సంచరించిన E-5, ఇళ్లను, పంటలను ధ్వంసం చేయడమే కాకుండా, పొలంలో కాపలాగా ఉన్న కంఝేది యాదవ్ అనే రైతుపై దాడి చేసి చంపేసింది.
ఏనుగును సురక్షితంగా పట్టుకోవడానికి అటవీశాఖ పలు ప్రయత్నాలు చేసింది. బాంధవ్‌గఢ్ ప్రాంతం నుంచి 6 శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను, సుమారు 150 మంది అటవీశాఖ సిబ్బందిని రంగంలోకి దించారు. భారీ యంత్రాలు, ఇతర ఏర్పాట్లతో ప్రయత్నించినప్పటికీ E-5 చిక్కలేదు. భారీ వర్షాలు, ఏనుగు ఎప్పటికప్పుడు స్థానం మార్చుకుంటుండటం రెస్క్యూ ఆపరేషన్‌కు సవాలుగా మారినట్లు అధికారులు తెలిపారు.
సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి E-5 రామ్‌నగర్ పట్టణ ప్రాంతంలోకి ప్రవేశించగా, ప్రజలు వాహనాల హారన్లు మోగించి అక్కడి నుంచి తరిమికొట్టారని సమాచారం. ఆ తర్వాత బాణ్‌సాగర్ డ్యామ్ వైపు వెళ్లిన ఏనుగు, సెప్టెంబర్ 28 తెల్లవారుజామున డ్యామ్ లోతైన నీటిలోకి దిగి, సుమారు 5 కి.మీ ఈది, ఒక ద్వీపాన్ని దాటుకుని బియోహరి అటవీ ప్రాంతానికి చేరుకుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. దీంతో మైహర్ ప్రాంతంలో 22 రోజులుగా ఉన్న భయాందోళనలకు తెరపడింది.

Leave a Reply