రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లా తున్కాలియా గ్రామంలో, ఒక వివాహ వేడుక సందర్భంగా ప్రమాదవశాత్తూ ఎయిర్‌గన్ పేలిన ఘటనలో కొత్తగా ఎన్నికైన మహిళా సర్పంచ్ షైలు రాజ్‌పురోహిత్ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇంట్లో పెళ్లి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతుండగా, ఒకరు ఎయిర్‌గన్‌ను శుభ్రం చేస్తున్న సమయంలో అనుకోకుండా దానిలో నుండి తూటా పేలినట్లు తెలుస్తోంది. ఆ తూటా షైలుకు తగలడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం జోధ్‌పూర్‌కు తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఆసుపత్రికి చేరుకోకముందే మార్గమధ్యలోనే షైలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వివాహ వేడుక కోసం తరలివచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. షైలు మృతదేహాన్ని గోటన్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
గోటన్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సుమన్ చౌదరి ఈ ఘటనను ధృవీకరించారు. ఎయిర్‌గన్ ఎలా పేలింది, ప్రమాదం జరిగిన పరిస్థితులు ఏమిటి అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక మరియు దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో షైలు రాజ్‌పురోహిత్ 1,228 ఓట్లు సాధించి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సుమన్‌పై (1,073 ఓట్లు) 155 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. అయితే సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించి ప్రజాసేవ ప్రారంభించకముందే ఆమె మృత్యువాత పడటం గ్రామస్తులను తీవ్ర విషాదంలో ముంచింది.

Leave a Reply